New RTC Depots : తెలంగాణలో మరో 2 ఆర్టీసీ డిపోలు.. ఏ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారంటే ?
ఆర్టీసీ ఆర్థిక కష్టాలను అధిగమించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అనడానికి ఈ రెండు కొత్త డిపోల(New RTC Depots) ఏర్పాటే నిదర్శనమని ఆయన చెప్పారు.
- By Pasha Published Date - 05:16 PM, Thu - 5 December 24

New RTC Depots : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ఆర్టీసీ డిపోలు ఏర్పాటు కానున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో కొత్త డిపోలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం లభించడంతో డిసెంబరు 4వ తేదీనే రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ డిపోల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ ఆర్థిక కష్టాలను అధిగమించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అనడానికి ఈ రెండు కొత్త డిపోల(New RTC Depots) ఏర్పాటే నిదర్శనమని ఆయన చెప్పారు. గత 15 ఏళ్లలో తెలంగాణలో కొత్తగా ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని ప్రభాకర్ తెలిపారు. కొత్త డిపోల ఏర్పాటు ద్వారా 3 రాష్ట్రాల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కలుగుతుందన్నారు.
Also Read :Mumbai Attack Kingpin: ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీకి పేరుకే జైలుశిక్ష.. ఉండేదంతా బయటే!
హైదరాబాద్ పరిధిలో నడిచే ఎంపిక చేసిన నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులలో సీటింగ్ విషయంలో ఆర్టీసీ పలు మార్పులు చేయనుంది. కొత్త సీటింగ్ డిజైన్ అచ్చం మెట్రో రైలులోని సీట్లను తలపించేలా ఉంటుందని అంటున్నారు. దీనివల్ల బస్సులో సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. గతంలో హైదరాబాద్‌లోని పలు సిటీ బస్సుల్లో మగ, ఆడ ప్రయాణికులను వేరు చేసే గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ స్కీం మొదలైనప్పటి నుంచి సిటీ బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో ఆ గ్రిల్స్‌ను తొలగిస్తున్నారు. వాటి స్థానంలో అదనపు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఆర్టీసీని పురోగతి బాటలో తీసుకెళ్లే దిశగా రేవంత్ సర్కారు యాక్టివ్‌గా పనిచేస్తోంది. ఓ వైపు సంక్షేమం.. మరోవైపు సౌకర్యం రెండింటిని ఏకకాలంలో బ్యాలెన్స్ చేస్తూ అడుగులు వేస్తోంది.