Mumbai Attack Kingpin: ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీకి పేరుకే జైలుశిక్ష.. ఉండేదంతా బయటే!
పేరుకు జైలుశిక్ష అనుభవిస్తున్నట్లుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నప్పటికీ.. జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ(Mumbai Attack Kingpin) వేషం మార్చుకొని, పేరు మార్చుకొని పాకిస్తాన్‌లో బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
- By Pasha Published Date - 04:17 PM, Thu - 5 December 24

Mumbai Attack Kingpin: 2008 సంవత్సరం నవంబరు 26వ తేదీని భారత్ మర్చిపోలేదు. ఆ రోజు మన దేశ వాణిజ్య రాజధాని ముంబై ఉగ్రదాడితో చిగురుటాకులా వణికిపోయింది. ఈ ఎటాక్‌లో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రక్తపాతానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తైబా’కు చెందిన కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ సూత్రధారి అని వెల్లడైంది. పాకిస్తాన్‌లోని ఒక కోర్టు అతడికి 2021 సంవత్సరంలో ఐదేళ్ల జైలుశిక్షను విధించింది. అయితే అతడికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్ఐ’ రక్షణ కల్పిస్తూ వస్తోంది. పేరుకు జైలుశిక్ష అనుభవిస్తున్నట్లుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నప్పటికీ.. జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ(Mumbai Attack Kingpin) వేషం మార్చుకొని, పేరు మార్చుకొని పాకిస్తాన్‌లో బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read :Shobhita’s first post after Marriage : పెళ్లి తర్వాత శోభిత పెట్టిన తొలి పోస్ట్
మహ్మద్ సయీద్.. ఇస్లామాబాద్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ మోడరన్ లాంగ్వేజెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతడు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని ‘మిస్టర్ పాకిస్తాన్’ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ప్రస్తుతం మహ్మద్ సయీద్ వద్ద జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహ్మద్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. భారత్‌కు చెందిన ఒక జాతీయ మీడియా సంస్థ ఈ వీడియోలోని జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ మొహాన్ని.. అతడి మునుపటి మొహంతో పోల్చి చూసింది. ఇందుకోసం అధునాతన ఆర్టిఫీషియల్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగించింది. దీంతో ఆ రెండు ఫొటోల్లో ఉన్నది ఒకరేనని.. బయట తిరుగుతున్న సదరు వ్యక్తి కచ్చితంగా ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీయే అని బట్టబయలైంది. లఖ్వీకి పాకిస్తాన్‌లోని రావల్పిండి, లాహోర్, ఒకారాలలో ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :Astronauts Rescue: ఐడియా ఇచ్చుకో.. రూ.16 లక్షలు పుచ్చుకో.. నాసా సంచలన ఆఫర్
ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆంక్షల భయంతో జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ జైలుశిక్ష అనుభవిస్తున్నాడని పాకిస్తాన్ ప్రభుత్వం బుకాయిస్తోంది. వాస్తవానికి అతగాడు స్వేచ్ఛగా జైలు బయటే తిరుగుతున్నాడు. లఖ్వీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది. ఇలాంటి ఉగ్రవాదులు బహిరంగంగా తిరుగుతున్నందు వల్లే పాకిస్తాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియాను పంపడం లేదని సమాచారం.