మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!
కార్పొరేట్ ఫైలింగ్స్ ప్రకారం.. డిసెంబర్ 31, 2025 నాటికి కంపెనీలో దాదాపు 79,000 మంది పనిచేస్తున్నారు. ఒకవేళ కంపెనీ 20 శాతం కోత విధిస్తే, సుమారు 16,000 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది.
- Author : Gopichand
Date : 15-03-2026 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
Meta Layoffs 2026: టెక్ ప్రపంచంలో అగ్రగామి సంస్థ అయిన మెటా ప్లాట్‌ఫారమ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ తన మొత్తం పని శక్తిలో దాదాపు 20 శాతం మేర తగ్గించుకోవాలని భావిస్తోంది. దీనివల్ల సుమారు 16,000 మంది ఉద్యోగుల ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత, మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఖర్చులను సమతుల్యం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్తులో AI సహాయంతో మరింత వేగంగా మరియు ప్రభావవంతంగా పనిచేసే టీమ్‌లను సిద్ధం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లేఆఫ్స్‌కు సంబంధించి అధికారిక తేదీ ఇంకా ఖరారు కాలేదు.
Also Read: MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం
వేలాది మంది ఉద్యోగులపై సంక్షోభం
కార్పొరేట్ ఫైలింగ్స్ ప్రకారం.. డిసెంబర్ 31, 2025 నాటికి కంపెనీలో దాదాపు 79,000 మంది పనిచేస్తున్నారు. ఒకవేళ కంపెనీ 20 శాతం కోత విధిస్తే, సుమారు 16,000 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రణాళిక అమలులోకి వస్తే 2022-23 కాలంలో జరిగిన భారీ పునర్నిర్మాణం తర్వాత ఇదే అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉందని, తుది నిర్ణయం వెలువడాల్సి ఉందని సమాచారం. గతంలో నవంబర్ 2022లో మెటా సుమారు 11,000 మంది ఉద్యోగులను (మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం) తొలగించింది. ఇప్పుడు అంతకంటే పెద్ద స్థాయిలో కోత విధించే అవకాశం కనిపిస్తోంది.
AI పైనే మెటా ఆశలు
మెటా గత ఏడాది కాలంగా AI రంగంలో ముందంజలో ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. దీని కోసం అనేక మంది టాప్ AI పరిశోధకులను తమ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ టీమ్‌లోకి ఆహ్వానించింది. సమాచారం ప్రకారం.. వారికి భారీ ప్యాకేజీలను కూడా ఆఫర్ చేసింది. దీనిని బట్టి మెటా తన భవిష్యత్తును పూర్తిగా AI వైపు మళ్లిస్తోందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా డేటా సెంటర్ల నిర్మాణం కోసం 2028 నాటికి సుమారు 600 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.