EV Charging Price : హైదరాబాద్లో ఈవీ ఛార్జింగ్ ధరలు ఎంత? పూర్తి సమాచారం ఇదే!
EV Charging Price : వాహనం బట్టి ఛార్జింగ్ ఖర్చు వేరు వేరు ఉంటుంది. రెండు చక్రాల వాహనాలకు 2-3 kWh బ్యాటరీలు ఉంటాయి. ఇంట్లో ఛార్జ్ చేస్తే ఒక్కసారి పూర్తి ఛార్జ్‌కు రూ.12-18 ఖర్చవుతుంది
- By Sudheer Published Date - 07:08 AM, Thu - 24 July 25

హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారంతోపాటు వాతావరణ కాలుష్యం తగ్గించాలన్న ఉద్దేశంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈవీ కొనుగోలు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా ఛార్జింగ్ (EV Charging) ఖర్చుల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా ఈవీ ఛార్జింగ్ ధరలను (EV Charging Price) నియంత్రిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ సబ్సిడీతో నిర్మించిన పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో కిలోవాట్ గంట (kWh)కు గరిష్ఠంగా రూ.12.06 వరకే వసూలు చేయాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు kWhకు రూ.7 వసూలు చేస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రం కేవలం రూ.5 మాత్రమే ఛార్జ్ చేస్తారు.
HHVM : హరిహర వీరమల్లు టాక్..పవన్ యాక్షన్ గూస్ బంప్స్
ఇక ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహించబడుతున్న చార్జింగ్ స్టేషన్లలో ధరలు తేడా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు, Fortum (GLIDA) సంస్థ హైదరాబాద్‌లో 30/60 kW ఛార్జర్లకు రూ.18.94, 200 kW వేగవంతమైన ఛార్జర్లకు రూ.21 వసూలు చేస్తోంది. టాటా పవర్ EZ Charge నగరంలో 97 చార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తోంది. అక్కడ కూడా వాహన స్పెసిఫికేషన్ ఆధారంగా ధరలు ఉంటాయి. Ather Grid, ElectricPe వంటి సంస్థలు కూడా నగరంలో తమ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాయి. ElectricPe నెట్‌వర్క్ తక్కువ దూరానికి సుమారు రూ.10 వరకు ఛార్జ్ చేస్తోంది. కొంతమంది అపార్టుమెంట్‌లు, వ్యక్తిగత ఇళ్ల వద్ద సొంతంగా ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ఇతరులకు సేవలు అందిస్తున్నారు. అక్కడ విద్యుత్ వినియోగంపై ఆధారపడి ధరలు ఉంటాయి. సగటున kWhకు రూ.6 ఖర్చు అవుతుంది.
Health Tips: వర్షంలో తడుస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!
వాహనం బట్టి ఛార్జింగ్ ఖర్చు వేరు వేరు ఉంటుంది. రెండు చక్రాల వాహనాలకు 2-3 kWh బ్యాటరీలు ఉంటాయి. ఇంట్లో ఛార్జ్ చేస్తే ఒక్కసారి పూర్తి ఛార్జ్‌కు రూ.12-18 ఖర్చవుతుంది. అదే పబ్లిక్ స్టేషన్‌ల్లో అయితే రూ.24-36 వరకు ఖర్చవుతుంది. ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువ కెపాసిటీ కావడంతో, వాటికి కిలోమీటర్‌కు సగటున రూ.1.50 వరకు ఖర్చవుతుంది. RACEnergy వంటి సంస్థలు కన్వర్షన్ కిట్లతో ఆటోలను ఈవీలుగా మార్చుతున్నారు. ఫోర్ వీలర్ల విషయానికి వస్తే, టాటా నెక్సాన్‌కు రూ.181-243, ఎంజీ ZSకి రూ.302, మహీంద్ర XUV400కి రూ.207-236, హ్యూందాయ్ కోనాకు రూ.235 వరకూ ఛార్జింగ్ ఖర్చు అవుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 500 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. GHMC పరిధిలో 150 DC ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రణాళికలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే వీటిలో 60కు పైగా పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2025 చివరి నాటికి 3,000 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. TSREDCO ద్వారా పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో కూడా 10,000 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కేంద్రం కూడా FAME స్కీమ్ ద్వారా ఈవీ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రాయితీలు ఇస్తోంది. ఇలా చూస్తే, హైదరాబాద్‌లో ఈవీ చార్జింగ్ వృద్ధి దిశగా వేగంగా సాగుతోంది.