Space Explorations 2024 : అంతరిక్షంలో అద్భుతాలు.. గ్రహాల గుట్టు విప్పేలా ప్రయోగాలు
ప్రపంచవ్యాప్తంగానూ ఎన్నో అంతరిక్ష మిషన్లు(Space Explorations 2024) విజయవంతంగా జరిగాయి. వాటిపై ఓ లుక్ వేద్దాం..
- By Pasha Published Date - 07:07 PM, Sun - 15 December 24

Space Explorations 2024 : అంతరిక్షం.. పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు మానవాళి అలుపెరగకుండా శ్రమిస్తోంది. అంతరిక్షం మాటున దాగిన రహస్యాలను తెలుసుకునేందుకు ఎన్నెన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే అంతరిక్ష ప్రయోగాలలో ధనిక దేశాలదే పైచేయిగా ఉంది. వాటి పెత్తనాన్ని శాసించే స్థాయికి మనదేశం ఎదిగింది. భారతదేశానికి చెందిన ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో భారతీయులంతా గర్వించేలా పనిచేస్తోంది. 2024 సంవత్సరంలో మన ఇస్రో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగానూ ఎన్నో అంతరిక్ష మిషన్లు(Space Explorations 2024) విజయవంతంగా జరిగాయి. వాటిపై ఓ లుక్ వేద్దాం..
Also Read :Guinness Family Of India : ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’.. ఒకే ఇంట్లో ముగ్గురు రికార్డు వీరులు
మన సునితా విలియమ్స్ ఇంకా అక్కడే
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునితా విలియమ్స్ ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోనే ఉన్నారు. అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆమె ఐఎస్ఎస్‌కు వెళ్లారు. 8 రోజుల్లోనే వారిద్దరు భూమికి తిరిగి రావాలి. కానీ స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి సునితా విలియమ్స్ భూమికి తిరిగొస్తారని భావిస్తున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ వ్యోమ నౌక ద్వారా సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమికి తీసుకురానున్నారు.
Also Read :Pushpa Dialogue Horror : ‘పుష్ప’ డైలాగ్స్ చెప్పి.. బాలుడి గన్ ఫైర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జేమ్స్‌వెబ్ టెలిస్కోప్.. మంచు నిక్షేపాలు
అంతరిక్షంలో ప్రయాణించే అతిపెద్ద టెలిస్కోప్.. జేమ్స్‌వెబ్. ఇది ఈ ఏడాది అక్టోబరులో ప్లూటోకు చెందిన అతిపెద్ద చంద్రుడు చరోన్‌పై కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నట్లు గుర్తించింది. సూర్యుడి నుంచి 300 కోట్ల మైళ్ల దూరంలోని కైపర్ బెల్ట్‌లోని మంచు నిక్షేపాల ఫొటోలను జేమ్స్ వెబ్ భూమికి పంపింది.
బృహస్పతి మంచు మిస్టరీ.. స్పేస్ ఎక్స్ ల్యూనార్ ల్యాండర్
నాసాకు చెందిన జూనో స్పేస్‌క్రాఫ్ట్ కీలక విషయాలను గుర్తించింది. బృహస్పతి గ్రహానికి చెందిన ఉపగ్రహం యూరోపా ఉపరితలంపై చాలా తక్కువ ఆక్సిజన్ ఉందని తేల్చింది. అయితే యూరోపాపై మహా సముద్రం ఉందని తెలిపింది. దీనివల్ల తక్కువ ఆక్సిజన్ స్థాయులు ఉన్నప్పటికీ.. అక్కడి మంచురాశుల్లో సూక్ష్మజీవులు వృద్ధి చెందగలుగుతాయని సైంటిస్టులు చెప్పారు.
అంగారకుడిపై భారీ మంచు నిక్షేపాలు
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మార్స్‌ఎక్స్‌ప్రెస్ ఆర్బిటర్ ఈ ఏడాది జనవరిలో కీలక విషయాలను గుర్తించింది. అరుణ గ్రహం (అంగారకుడు) ఉపరితలం లోపలిపొరలో 3.7 కిలోమీటర్ల మందంతో భారీగా మంచు నిక్షేపాలు ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. ఆ మంచు నిక్షేపాలను కరిగిస్తే.. ఆ గ్రహం మొత్తంలో 2 మీటర్ల మందమైన నీటిపొరను సృష్టించగలమన్నారు. అయితే మంచు నిక్షేపాలు ఏకంగా అంగారకుడి మధ్యరేఖా ప్రాంతంలోనే ఉన్నాయని తేలడం గమనార్హం.
సూర్యుడి కంటే ప్రకాశవంతమైన క్వాసార్
అద్భుతం అంటే ఇదే!! మనకు తెలియని అద్భుతాలు ఎన్నో అంతరిక్షంలో దాగి ఉన్నాయి. సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ప్రకాశవంతమైన క్వాసార్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి J0529-4351 అని పేరు పెట్టారు. సూర్యుడి కంటే 17వందల కోట్ల రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన సూపర్ మాసీవ్ కృష్ణబిలం ద్వారా ఆ క్వాసార్‌కు శక్తి లభిస్తోందని సైంటిస్టులు చెప్పారు.
1500 కోట్ల మైళ్ల దూరంలోని వాయేజర్-1తో మళ్లీ కమ్యూనికేషన్
వాయేజర్-1 అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్. 2023 నవంబర్‌లో సాంకేతిక లోపం వల్ల దానితో నాసా కనెక్షన్ కోల్పోయింది. చాలా ట్రబుల్‌షూట్ల తర్వాత 2024 ఏప్రిల్‌లో దానితో నాసా తిరిగి కనెక్ట్ అయింది. భూమికి 1500 కోట్ల మైళ్ల దూరంలో ప్రస్తుతం వాయేజర్-1 ఉందని గుర్తించారు.