T20 : పాకిస్తాన్ కు షాకిచ్చిన జింబాబ్వే…1 పరుగు తేడాతో పాకిస్తాన్ పై విజయం..!!
- By hashtagu Published Date - 08:27 PM, Thu - 27 October 22

టీ 20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది జింబాబ్వే. ఒక్క పరుగుతో జింబాబ్వే పాకిస్తాన్ పై విజయం సాధించింది. పాకిస్తాన్ తో పసికూన ఆడిన ఆట తీరు చేస్తుంటే..ప్రతి క్రికెట్ అభిమాని శెభాష్ జింబాబ్వే అనాల్సిందే. ఎందుకంటే ఆ జట్టు చేసిన పోరాటం అలాంటిది. తొలుత బ్యాటింగ్ లో డీలా పడినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది. చివరి బంతి వరకూ ఎంతో పట్టుదలతో ఆడింది. చివరకు పాకిస్తాన్ ను ముప్పుతిప్పలు పెట్టింది. పాకిస్తాన్ కు కోల్కోలేని దెబ్బతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది జింబాబ్వే. 131 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 129 పరుగులకే ముగించేసింది. ఫలితంగా ఒక్క పరుగుతో జింబాబ్వే గెలిచింది.
A special win for Zimbabwe! 🇿🇼#PAKvZIM | #T20WorldCup pic.twitter.com/IBnZUchk9A
— The Cricketer (@TheCricketerMag) October 27, 2022
టీ ట్వంటీ ప్రపంచకప్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాకిస్తే… తాజాగా జింబాబ్వే పాక్‌ను నిలువరించింది. ఉత్కంఠభరితంగా సాగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో పాకిస్థాన్ 1 పరుగు తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 130 పరుగులు చేయగా…సీన్ విలియమ్స్ 31 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక దశలో జింబాబ్వే భారీస్కోర్ చేసేలా కనిపించింది. ఐదు ఓవర్లలోనే ఓపెనర్లు 42 రన్స్‌తో మంచి పునాది వేసారు. అయితే మిడిల్ ఓవర్లలో జింబాబ్వే వరుస వికెట్లు కోల్పోయింది.
మహ్మద్ వాసిమ్ జూనియర్ ఆ జట్టు జోరుకు బ్రేక్ వేశాడు. 25 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. బాబర్ అజామ్, రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ విఫలమయ్యారు. దీంతో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. షాన్ మసూద్ పోరాడడంతో పాక్ గెలిచేలా కనిపించింది. 44 పరుగులు చేసిన మసూద్ కీలక సమయంలో ఔటవడం.. నవాజ్ కూడా భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
చివర్లో జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్‌ను 129 పరుగులకే పరిమితం చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా 25 పరుగులకు 3 వికెట్లు తీయగా.. చివర్లో ఎవాన్స్ 2 వికెట్లు పడగొట్టి చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టమయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. తర్వాత సౌతాఫ్రికా, జింబాబ్వే రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.