Yuzvendra Chahal: రెండు నెలల్లో మోసం చేస్తే నాలుగున్నరేళ్లు ఎలా నిలబడుతుంది?: చాహల్
తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. చాహల్ తాను ప్రస్తుతానికి సింగిల్ అని, ఇప్పుడే ఏ కొత్త బంధానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. తన జీవితం సుఖంగా, సంతోషంగా ఉందని, తన తల్లి కూడా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 04:30 PM, Wed - 8 October 25

Yuzvendra Chahal: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన మాజీ భార్య ధనశ్రీ వర్మ ఇటీవల తనపై చేసిన మోసం ఆరోపణలపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ఈ ఆరోపణలను ఆయన నిరాధారమైనవని కొట్టిపారేస్తూ ఈ విషయం తన ఆటపై, జీవితంపై ఎటువంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు.
రెండు నెలల్లో మోసం చేస్తే నాలుగున్నరేళ్లు ఎలా నిలబడుతుంది?
ఒక ప్రముఖ రియాలిటీ షోలో ధనశ్రీ వర్మ పాల్గొంటూ తమ వివాహం జరిగిన రెండు నెలల్లోనే చాహల్ తనకు మోసం చేశాడని ఆరోపించిన క్లిప్ వైరల్ అయిన నేపథ్యంలో ఈ భారతీయ స్పిన్నర్ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడారు. చాహల్ మాట్లాడుతూ.. తాను ఒక క్రీడాకారుడిని అని, మోసం చేసే వ్యక్తిని కానని అన్నారు. “పెళ్లయిన రెండు నెలల్లోనే మోసం జరిగితే ఆ పెళ్లి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు ఎలా నిలబడుతుంది? ఇది లాజిక్ లేని ప్రశ్న. నా వరకు ఈ అధ్యాయం ముగిసింది. పూర్తిగా మూసివేయబడింది. నేను నా జీవితంలో ముందుకు సాగాను. మిగిలిన వారు కూడా అలానే చేయాలి” అని అన్నారు.
Also Read: Rajveer Jawanda : యువ సింగర్ మృతి
వారి ఇల్లు నా పేరుతోనే నడుస్తోంది
కొంతమంది ఇప్పటికీ తమ పాత జీవితాన్ని పట్టుకుని వేలాడుతున్నారని చాహల్ నొక్కి చెప్పారు. “ఇప్పటికీ చాలామంది ఆ విషయాన్ని పట్టుకుని ఉన్నారు. ఇప్పటికీ వారి ఇల్లు నా పేరుతోనే నడుస్తోంది. కాబట్టి వారు అలా చేస్తూనే ఉండవచ్చు. నాకు దీని గురించి ఎలాంటి బాధ లేదు. నేను ప్రభావితం కావడం లేదు” అని ఘాటుగా బదులిచ్చారు.
తాను ఈ అధ్యాయాన్ని మర్చిపోయానని పునరుద్ఘాటించారు. “వంద విషయాలు చెబుతున్నారు. కానీ నిజం కేవలం ఒకటే. ముఖ్యమైన వ్యక్తులకు ఆ నిజం తెలుసు. నేను నా జీవితంపై, నా ఆటపై దృష్టి పెడుతున్నాను. ఈ అధ్యాయం గురించి నేను చివరిసారిగా మాట్లాడుతున్నాను” అని చాహల్ తెలిపారు.
ప్రస్తుతానికి ‘సింగిల్’
తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. చాహల్ తాను ప్రస్తుతానికి సింగిల్ అని, ఇప్పుడే ఏ కొత్త బంధానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. తన జీవితం సుఖంగా, సంతోషంగా ఉందని, తన తల్లి కూడా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.