WTC Format: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారీ మార్పులు!
డబ్ల్యూటీసీ మార్పుపై పని చేయడానికి 5 నెలల సమయం ఉంది. రాబోయే WTC సైకిల్‌లో ఏ నిర్మాణం అవసరమో మేమే పరిశీలిస్తున్నాం.
- By Gopichand Published Date - 07:49 PM, Sun - 2 February 25

WTC Format: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. డబ్ల్యూటీసీ (WTC Format) ఫైనల్‌లో భారత్ చోటు దక్కించుకోకపోవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు ఫైనల్ ఆడింది. అయితే టైటిల్ మ్యాచ్‌లో భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 చివరి మ్యాచ్ లార్డ్స్ మైదానంలో జూన్ 11-15 మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత WTCకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
WTC ఫైనల్ తర్వాత ముఖ్యమైన నిర్ణయం?
టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నాలుగో ఎడిషన్ కోసం ICC ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోనుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ వర్గాలతో మాట్లాడుతూ.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత నిర్మాణం సరిగ్గా పనిచేయడం లేదని ఇప్పుడు పూర్తిగా అర్థమైందని అన్నారు. WTC సైకిల్‌కు సరసమైన, మెరుగైన పోటీని తీసుకురానున్నాం. అయితే ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎలాంటి సిఫార్సులు రాలేదు అని ఆయన అన్నారు.
Also Read: Ex- Minister Roja: రేపు ఎన్నికలు.. ఏపీ ఎన్నికల అధికారికి రోజా విన్నపం!
మార్పుల గురించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ మార్పుపై పని చేయడానికి 5 నెలల సమయం ఉంది. రాబోయే WTC సైకిల్‌లో ఏ నిర్మాణం అవసరమో మేమే పరిశీలిస్తున్నాం. WTCలో అన్ని జట్లకు సమాన పోటీ ఉండాలి. చిన్న జట్లతో పాటు పెద్ద జట్లకు సమాన అవకాశం కల్పించాలి. టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని పరిరక్షిస్తాం. మేము టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహిస్తాము. ఎందుకంటే ఇది క్రికెట్‌కి ముఖ్యమైనది. ఇది త్వరలో మార్చబడుతుందని అని ఆయన అన్నారు.
గత 3 WTC సైకిల్స్‌లో కేవలం మూడు జట్లు భారత్, ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా మాత్రమే 15 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడాయి. ఈ జట్లు 4 లేదా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడాయి. అయితే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లు ఒక ఎడిషన్‌లో చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాయి. ఈ జట్లు ఎక్కువగా 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను మాత్రమే ఆడాయి. కొత్త నివేదిక ప్రకారం.. రాబోయే కాలంలో అన్ని జట్లూ WTC సైకిల్‌లో సమానంగా ఆడేలా ఐసీసీ ప్లాన్ చేస్తోంది.