ICC Trophies: ఐసీసీ ట్రోఫీ… అసాధ్యాలను సుసాధ్యం చేసిన ధోనీ
ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు చివరిసారిగా 2013లో ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది జరిగి 10 ఏళ్లు గడిచినా భారత జట్టుకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా రాలేదు.
- Author : Praveen Aluthuru
Date : 12-06-2023 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
ICC Trophies: ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు చివరిసారిగా 2013లో ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది జరిగి 10 ఏళ్లు గడిచినా భారత జట్టుకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా రాలేదు. ఓవల్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా మరోసారి బోల్తా పడటంతో రోహిత్ సేన టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడిన తరువాత భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసుకున్నారు. (ICC Trophies)
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఐసీసీ ట్రోఫీని గెలవడం అంత ఈజీ కాదని.. కానీ మహేంద్ర సింగ్ ధోనీ దాన్ని సుసాధ్యం చేశాడని అన్నాడు. కష్టమైన ఐసీసీ ట్రోఫీని ధోనీ చాలా ఈజీగా సాధించాడని శాస్త్రి ఓ ప్రకటనలో పంచుకున్నాడు. ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. ధోనీ కెప్టెన్సీలో 2007లో టీ 20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియా దక్కించుకుంది. ధోనీ నాయకత్వంలోని టీమిండియా రెండు సార్లు ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. 2010, 2016లో జరిగిన ఆసియా కప్ టోర్నీలలో విజేతగా నిలిచింది. (MS Dhoni)
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలిరోజు నుంచి టీమిండియాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 444 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు మొత్తం 234 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మరియు ఛెతేశ్వర్ పుజారా WTC ఫైనల్‌లో ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 56 పరుగులు చేయగలిగాడు. అదే సమయంలో పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ చాలా చెత్త షాట్లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో చౌకగా పెవిలియన్‌కు చేరిన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేశాడు. అయితే కీలక సమయంలో అవుట్ అయ్యాడు.
Read More: ICC Tournaments: టీమిండియాకు ఐసీసీ ఫోబియా !