Virat Kohli: కోహ్లీకి పాంటింగ్ సపోర్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచీ అసలు పరుగులు చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు.
- By Naresh Kumar Published Date - 10:22 AM, Sun - 12 June 22

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచీ అసలు పరుగులు చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లోనూ కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. ఈసారి ఐపీఎల్ లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 341 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి ఆటతీరుపపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, వీరేంద్ర సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్లు కోహ్లి ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరయితే విరాట్ కొన్ని రోజులు క్రికెట్ నుంచీ బ్రేక్ తీసుకోవాలంటూ సలహాలు కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలోఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోహ్లికి అండగా నిలిచాడు. ప్రస్తుతం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్నటీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై రికీ పాంటింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. త్వరలోనే కోహ్లి మళ్ళీ పరుగుల వరద పారిస్తాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లి ఈ ఏడాది పెద్దగా రాణించలేదనీ, ఏ ఆటగాడైన కెరీర్ లో ఇలాంటి క్లిష్ట దశను ఎదుర్కొంటాడనీ చెప్పాడు కోహ్లి గత 12 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్న విషయాన్ని పాంటింగ్ గుర్తు చేశాడు. అయితే అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతి లభించింది. దీన్ని అతను చక్కగా ఉపయోగించుకొని సమస్య ఏంటో తేల్చుకోవాల్సి ఉంటుందన్నాడు. కోహ్లీ ఓ అద్భుతమైన ఆటగాడనీ , చిన్న వయసులోనే ఎన్నో అరుదైన రికార్డులను సాధించాడనీ చెప్పుకొచ్చాడు.
అతనికి పట్టుదల ఎక్కువని , త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు శ్రమిస్తాడని ధీమా వ్యక్తంచేశాడు.ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైన టెస్టుతో కోహ్లి తిరిగి ఫామ్ అందుకోవచ్చని పాంటింగ్ అంచనా వేశాడు. ఇదిలా ఉంటే కోహ్లీ గత కొన్ని నెలలుగా ఫామ్‌లేమితో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నా అభిమానుల ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న ఏషియా సెలబ్రిటీ గా నిలిచాడు.
Related News

Virat Kohli Fans:వీరూపై కోహ్లీ ఫ్యాన్స్ గరం గరం
ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో శాసించే స్థితికి చేరిన భారత్ సిరీస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.