Kohli : బీసీసీఐ ఆఫర్ ను తిరస్కరించిన కోహ్లీ
భారత టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి అతను తప్పుకున్నట్లయ్యింది.
- By Hashtag U Published Date - 01:06 PM, Tue - 18 January 22

భారత టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి అతను తప్పుకున్నట్లయ్యింది. అయితే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు జరిగిన ఓ అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కొన్ని గంటల ముందు బీసీసీఐ నుంచి కోహ్లికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం. తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే 100వ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్ గా వ్యవహరించిన తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోమని బీసీసీఐ పెద్దలు కోహ్లిని కోరినట్టు తెలుస్తోంది. కోహ్లీ మాత్రం ఈ ఆఫర్ ను తిరస్కరించాడట. ఒక్క మ్యాచ్ కోసం తన నిర్ణయంలో మార్పు ఏమీ ఉండదంటూ విరాట్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కోహ్లి ఫిబ్రవరి 25 నుంచి శ్రీలంకతో జరిగే తొలి మ్యాచ్ ద్వారా వంద టెస్ట్‌ల ఘనతను అందుకోనున్నాడు. ఈ టెస్ట్‌కు బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదిక కానుంది.
ఐపీఎల్‌లో మొదటి నుంచి ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీకి చిన్నస్వామి స్టేడియంతో చక్కటి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆ 100వ టెస్టుని కెప్టెన్ వీడ్కోలు మ్యాచ్‌లా ఘనంగా నిర్వహిస్తామని బీసీసీఐ ఆఫర్ ఇచ్చింది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం దీన్ని రిజెక్ట్ చేశాడు. నిజానికి సఫారీ పర్యటనలోనే కోహ్లీ 100 టెస్టులు పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే రెండో టెస్టుకు కొద్ది గంటల ముందు గాయంతో తప్పుకున్నాడు. దీంతో టెస్టుల సెంచరీ అందుకోలేకపోయాడు. మూడో టెస్ట్ ఓటమి తర్వాత సారథి బాధ్యతలకు రాజీనామా చేయడం, బీసీసీఐ వెంటనే స్వాగతించడం కూడా జరిగిపోయాయి. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ 68 మ్యాచ్‌ల్లో జట్టు నడిపించాడు. ఇందులో 40 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించగా.. విదేశీ గడ్డపై అత్యధిక టెస్టుల్లో విజయాల్ని అందుకున్న భారత కెప్టెన్‌గా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఆటగాడిగా పేలవ ఫామ్ , సౌతాఫ్రికా సిరీస్ ఓటమితో పాటు బీసీసీఐతో సంబంధాలు దెబ్బతినడంతో కోహ్లీ బోర్డు తనను తొలగించకముందే తప్పుకున్నాడన్న వాదన వినిపిస్తోంది.