వైభవ్ సూర్యవంశీకి నిజంగా 15 ఏళ్లేనా?
అన్ని వైద్య పరీక్షలు, బీసీసీఐ రికార్డుల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత వయస్సు 15 ఏళ్లే అని నిర్ధారించబడింది.
- Author : Gopi
Date : 12-04-2026 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో తన తుఫాను బ్యాటింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఈ యువ బ్యాటర్ తన దూకుడుతో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి దిగ్గజ జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే మైదానంలో అతను పెద్ద పెద్ద బౌలర్లను ఎదుర్కొంటూ సులభంగా సిక్సర్లు బాదుతుండటంతో అతని వయస్సుపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వైభవ్ నిజంగానే 15 ఏళ్ల వాడా? లేక వయస్సు దాచి ఆడుతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని ఏళ్ల క్రితం బీసీసీఐ విడుదల చేసిన ఒక నివేదిక ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది వైభవ్ వయస్సుపై వస్తున్న సందేహాలకు చెక్ పెడుతోంది.
ఏమిటా నివేదిక?
రిపోర్టుల ప్రకారం.. 2019-20 సీజన్ సమయంలో వైభవ్ సూర్యవంశీకి ‘బోన్ టెస్ట్’ (ఎముకల పరీక్ష – వయస్సు నిర్ధారణ కోసం చేసే పరీక్ష) నిర్వహించారు. ఆ సమయంలో వైభవ్ సమర్పించిన పత్రాల ప్రకారం అతని వయస్సు 8.5 ఏళ్లుగా ఉంది. అయితే శాస్త్రీయంగా నిర్వహించిన బోన్ టెస్ట్‌లో అతని వయస్సు 10.1 నుండి 10.4 ఏళ్ల మధ్య ఉన్నట్లు తేలింది.
సాధారణంగా పత్రాల్లో ఉన్న వయస్సుకు పరీక్షల్లో తేలిన వయస్సుకు మధ్య వ్యత్యాసం ఉంటే దానిని సీరియస్‌గా పరిగణిస్తారు. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బోన్ టెస్ట్ ఫలితాల్లో, కాగితాల్లో ఉన్న వయస్సులో రెండు ఏళ్ల వరకు తేడా ఉంటే దానిని ఆమోదయోగ్యంగానే పరిగణిస్తారు. వైభవ్ విషయంలో ఈ వ్యత్యాసం రెండు ఏళ్ల లోపే ఉండటంతో, బీసీసీఐ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది.
Also Read: ఏప్రిల్‌లో ఫిబ్రవరి వంటి చలి ఇంకెన్నాళ్లు?
నిజమైన వయస్సు 15 ఏళ్లే!
అన్ని వైద్య పరీక్షలు, బీసీసీఐ రికార్డుల ప్రకారం.. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత వయస్సు 15 ఏళ్లే అని నిర్ధారించబడింది. అతను చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తుండటంతో, అది చూసి జీర్ణించుకోలేని కొందరు వయస్సుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయస్సులో అడుగుపెట్టిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన వైభవ్.. తన బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో అతను భారత క్రికెట్లో ఒక గొప్ప ధ్రువతారగా ఎదిగే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజాలు సైతం ప్రశంసిస్తున్నారు.