Smriti Mandhana: మహిళల క్రికెట్ లోనూ భారత్ జోరు.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి
ఈ అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. వారిద్దరినీ వెనక్కి నెట్టిన స్మృతి వన్డేల్లో మేటి ప్లేయర్ గా నిలిచింది.
- By Naresh Kumar Published Date - 02:11 PM, Tue - 28 January 25

Smriti Mandhana: ఐసీసీ వార్షిక అవార్డుల్లో భారత్ ఆటగాళ్ళ ఆధిపత్యం కొనసాగుతోంది. పురుషుల వన్డే జట్టులో ఒక్కరికీ చోటు దక్కకున్నా… టెస్ట్ టీమ్ తో పాటు టీ ట్వంటీ టీమ్ లోనూ మన క్రికెటర్లు చోటు దక్కించుకున్నాడు. అటు మహిళల క్రికెట్ లోనూ భారత్ క్రికెటర్లు సత్తా చాటారు. తాజాగా వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి మంధాన (Smriti Mandhana) ఎంపికైంది. గతేడాది వన్డేల్లో స్మృతి మంధాన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గతేడాది వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు, శతకాలు చేసిన మహిళా బ్యాటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. గతేడాది మొత్తం 13 వన్డేలు ఆడిన మంధన 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. దీనిలో 4 సెంచరీలు ఉన్నాయి. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై ఒక్కో శతకం సాధించింది.
ఈ అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. వారిద్దరినీ వెనక్కి నెట్టిన స్మృతి వన్డేల్లో మేటి ప్లేయర్ గా నిలిచింది. స్మృతి మంధాన అసాధారణ ప్రదర్శనతో ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు అర్హత సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో మంధాన 24 ఇన్నింగ్స్‌ల్లో 1358 పరుగులు చేసింది. మంధాన సూపర్ బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలుచుకుంది.
Also Read: South Africa: సౌతాఫ్రికా మరో స్టార్ ఆటగాడికి గాయం.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం?
ఇదిలా ఉంటే మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్, ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్‌లలో చోటు దక్కించుకుంది. వన్డే టీమ్‌కు మంధనతో పాటు భారత్ నుంచి దీప్తి శర్మ ఎంపికవగా.. టీ20 టీమ్‌లో మంధన, దీప్తి శర్మతో పాటు భారత్ నుంచి రిచా ఘోష్ కూడా చోటు దక్కించుకుంది. కాగా 28 ఏళ్ళ స్మృతి మంధాన 2013లో బంగ్లాదేశ్ వన్డే అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకూ 92 వన్డేల్లో 4209 పరుగులు చేయగా.. దీనిలో 10 శతకాలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.