SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్
ఈ వ్యాఖ్యలు రాజకీయ స్వరూపంలో పరిగణించబడతాయని భావించిన ICC, సూర్యకుమార్‌కు విచారణ నోటీసు జారీ చేసింది.
- By Dinesh Akula Published Date - 10:22 PM, Thu - 25 September 25

న్యూఢిల్లీ: (Surya Kuamr Yadav) పాక్‌తో ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన పహల్గాం వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సీరియస్ అయింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్, భారత విజయం భారత సాయుధ దళాలకు అంకితం చేస్తూ, పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ స్వరూపంలో పరిగణించబడతాయని భావించిన ICC, సూర్యకుమార్‌కు విచారణ నోటీసు జారీ చేసింది. దీనిపై జరిపిన విచారణకు సూర్యకుమార్‌తో పాటు బీసీసీఐ సీఓఓ హేమంగ్ అమిన్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ సమ్మర్ మల్లపుర్కర్ హాజరయ్యారు. విచారణకు రిచీ రిచర్డ్‌సన్ నేతృత్వం వహించారు.
విచారణలో సూర్యకు విషయం వివరంగా చెప్పిన అనంతరం, ఇది లెవెల్ 1 విభాగంలోకి వస్తుందనీ, తుది నిర్ణయంగా అతడికి కేవలం వార్నింగ్ ఇవ్వవచ్చో లేక మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించవచ్చని సమాచారం.
పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, భారత్–పాక్ సంబంధాలు మరింత దిగజారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్యకుమార్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలి ఆఘాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ చేతులు కలపలేదు.
ఇక, భారత బోర్డు మరో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాక్ ఆటగాడు షాహిబ్‌జాదా పర్హాల్ గన్ సెలబ్రేషన్ చేయగా, హరీస్ రవూఫ్ “6-0” అని చూపిస్తూ వివాదాస్పద సైగ చేశాడు. దీనిపై కూడా ఐసీసీ విచారణ చేపట్టనుంది.