Shreyas Iyer: ఆసియా కప్ 2025.. అయ్యర్‌కు ఇంకా ఛాన్స్ ఉందా?
ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మ్యాన్ అవసరం ఎంతైనా ఉంది. గతంలో అయ్యర్ జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితులలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది.
- By Gopichand Published Date - 09:50 PM, Sat - 23 August 25

Shreyas Iyer: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తరువాత జట్టులో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు చోటు దక్కకపోవడం క్రికెట్ అభిమానులను, మాజీ క్రికెటర్లను ఆశ్చర్యపరిచింది. అతని ఫిట్‌నెస్, గత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే అయ్యర్‌ను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆసియా కప్ నిబంధనల ప్రకారం గాయం కారణంగా ఏ ఆటగాడైనా తప్పుకుంటే, అతని స్థానంలో అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది.
అయ్యర్‌ను ఎందుకు పక్కన పెట్టారు?
భారత జట్టు సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్‌కు బదులుగా ఇతర యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. గత కొంత కాలంగా అతని ఫామ్, ఫిట్‌నెస్‌పై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా వెన్ను సమస్యల కారణంగా అతను గతంలో క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్‌లలో అతని ప్రదర్శన మెరుగ్గానే ఉంది. అయినా సరే సెలెక్టర్లు మధ్యస్థ ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల మరో ఆటగాడిని ఎంచుకున్నారు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయ్యర్‌కు తగినంత అవకాశాలు ఇవ్వకుండా జట్టు నుంచి తొలగించారని వారు అభిప్రాయపడ్డారు.
Also Read: Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
ఆసియా కప్ నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిబంధనల ప్రకారం.. టోర్నమెంట్‌లో పాల్గొనే ఏ జట్టుకైనా ఒక ఆటగాడు గాయం లేదా అనారోగ్యం కారణంగా టోర్నమెంట్ మధ్యలో తప్పుకుంటే ఆ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంటుంది. టీమ్ మేనేజ్‌మెంట్ దీని గురించి ACC టెక్నికల్ కమిటీకి తెలియజేసి, వారి అనుమతి పొందిన తర్వాత ప్రత్యామ్నాయ ఆటగాడిని జట్టులోకి తీసుకోవచ్చు. ఈ నిబంధన ప్రకారం టోర్నమెంట్ ప్రారంభమయ్యాక కూడా భారత జట్టులోని ఏ ఆటగాడికైనా గాయమైతే, అయ్యర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
టీమ్ ఇండియాకు అయ్యర్ అవసరమా?
ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మ్యాన్ అవసరం ఎంతైనా ఉంది. గతంలో అయ్యర్ జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితులలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం తీసుకురావడంలో అతను ఎంతో సహాయపడతాడు. ప్రస్తుత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి అనుభవం లేని కారణంగా ఒత్తిడిలో ఎలా రాణిస్తారో చూడాలి. అందువల్ల అయ్యర్‌ను జట్టులో చేర్చుకోవడం వల్ల టీమ్ బ్యాటింగ్‌కు మరింత బలం చేకూరుతుంది.