Virat Kohli : కోహ్లీ క్యాచ్ ల సెంచరీ
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో సెంచరీ చేసిన రెండేళ్ళు దాటిపోయింది. తాజాగా కేప్ టౌన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగులు చేసినా శతకం సాధించలేకపోయాడు. అయితే కోహ్లీ మాత్రం మరో విభాగంలో సెంచరీ సాధించాడు.
- By Hashtag U Published Date - 01:20 PM, Thu - 13 January 22

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో సెంచరీ చేసిన రెండేళ్ళు దాటిపోయింది. తాజాగా కేప్ టౌన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగులు చేసినా శతకం సాధించలేకపోయాడు. అయితే కోహ్లీ మాత్రం మరో విభాగంలో సెంచరీ సాధించాడు. అది ఫీల్డింగ్ లో 100 క్యాచ్ లు పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ షమీ వేసిన ఓవర్లో బవూమా ఇచ్చిన క్యాచ్ ను అద్భుతంగా అందుకున్న కోహ్లీ కెరీర్ లో వంద క్యాచ్ లు కంప్లీట్ చేసుకున్నాడు. తద్వారా ఈ రికార్డ్ సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు.
భారత్ తరపున అత్యధిక క్యాచ్ లు అందుకున్న రికార్డ్ రాహుల్ ద్రావిడ్ పేరిట ఉంది. ద్రావిడ్ 209 క్యాచ్ లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా… వివిఎస్ లక్ష్మణ్ 135, సచిన్ టెండూల్కర్ 115 క్యాచ్ లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గవాస్కర్ 108 , అజారుద్దీన్ 105 క్యాచ్ లతో కోహ్లీ కంటే ముందున్నారు. ఇక రహానే 99 క్యాచ్ లు అందుకోగా… సెహ్వాగ్ 90 క్యాచ్ లతో ఏడో స్థానంలో ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్ లో రహానే కూడా క్యాచ్ ల సెంచరీ పూర్తి చేసే అవకాశముంది. ప్రస్తుతం కోహ్లీ పట్టిన 100వ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్యాటింగ్ లో సెంచరీ చేజారినా… ఫీల్డింగ్ లో శతకం సాధించాడంటూ అభిమానులు సరిపెట్టుకుంటున్నారు. మరి రెండో ఇన్నింగ్స్ లోనైనా కోహ్లీ సెంచరీ చేస్తాడేమో చూడాలి.