Sachin Tendulkar : నేడు దంతెవాడకు సచిన్ .. కారణం ఇదేనా!
- Author : Vamsi Chowdary Korata
Date : 22-04-2026 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో పర్యటించనున్నారు. ఎప్పుడూ ఫుల్ సెక్యూరిటీ మధ్య ఉండే సచిన్… ఇప్పుడు ఏకంగా నక్సల్స్ కు అడ్డా అయిన ప్రాంతంలో అడుగుపెడుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. క్రీడల ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ఈ అడుగు వేశారు.
సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, మాన్ దేశి ఫౌండేషన్, జిల్లా యంత్రాంగం కలిసి ‘మైదాన్ కప్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. సుమారు 50 గ్రామాల్లో క్రీడా మైదానాలను నిర్మించి, 10 వేల మందికి పైగా ఆదివాసీ యువతను తుపాకుల బాట పట్టకుండా, ఆటల బాట వైపు మళ్లించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.
కార్యక్రమంలో భాగంగా, పనేడాలో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంను సచిన్ ప్రారంభించనున్నారు. 2020లో నేలపై పాకుతూ క్రికెట్ ఆడుతున్న దివ్యాంగ యువకుడు మద్దారామ్ వీడియో చూసి సచిన్ అప్పట్లోనే చలించిపోయారు. అతనికి క్రికెట్ కిట్ పంపించి ప్రోత్సహించిన సచిన్, ఇప్పుడు స్వయంగా మద్దారామ్‌ను కలిసి అతనితో క్రికెట్ ఆడనున్నారు. తన అభిమాన దైవాన్ని నేరుగా కలుస్తుండటంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేవు. మరోవైపు, సమాజం పట్ల సచిన్ కు ఉన్న నిబద్ధతను అందరూ ప్రశంసిస్తున్నారు.