Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల విస్తరణ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం గాంధీభవన్‌లో
- Author : Latha Suma
Date : 19-07-2026 - 3:36 IST
Published By : Hashtagu Telugu Desk
Komatireddy Raj Gopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల విస్తరణ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో భేటీ అయిన అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తాను అన్నదమ్ములం అయినప్పటికీ ఇద్దరివి వేర్వేరు కుటుంబాలని, ఒకే కుటుంబం కాదని స్పష్టం చేశారు. తనకు రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వడానికి, వెంకట్‌రెడ్డి తనకు సోదరుడు కావడానికి అసలు ఏం సంబంధం ఉందని ఆయన అధిష్ఠానాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు ఇవ్వకూడదనే నిబంధన తమకు వర్తించదని, రాజకీయాల్లో ఎవరి ప్రాధాన్యత, ఎవరి కష్టం వారిదేనని పేర్కొంటూ తనకు మంత్రి పదవి దక్కకుండా సొంత పార్టీలోనే కొందరు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన పరోక్షంగా తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఒకే కుటుంబంలో రెండు పదవులు అక్కడ లేవా?.. మంత్రి ఉత్తమ్‌పై రాజగోపాల్ రెడ్డి పరోక్ష బాణాలు!
రాజగోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యల్లో ఒకే కుటుంబానికి రెండు పదవుల అంశాన్ని ప్రస్తావిస్తూ సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులను టార్గెట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే (ఉత్తమ్ కుమార్ రెడ్డి), కోదాడ ఎమ్మెల్యే (పద్మావతి రెడ్డి) ఒకే కుటుంబం అవుతారు కదా అని ఆయన పరోక్షంగా నిలదీశారు. అక్కడ లేని అభ్యంతరం తమ విషయానికే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి, ఉపఎన్నికల సవాళ్లను ఎదుర్కొని గెలిచిన తనకు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కాల్సిందేనని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా అధిష్ఠానానికి గట్టి సంకేతాలు పంపారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో పెను దుమారానికి తెరలేపగా, రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ వేళ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.