Saba Karim: వారి బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే తప్పేముంది
గత కొన్నేళ్లుగా సీనియర్లకు ధీటుగా యువ ఆటగాళ్లు చక్కగా రాణిస్తున్నారు.
- By Naresh Kumar Published Date - 04:50 PM, Sat - 25 June 22

గత కొన్నేళ్లుగా సీనియర్లకు ధీటుగా యువ ఆటగాళ్లు చక్కగా రాణిస్తున్నారు. తమకు అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్నాడు. రెండు హాఫ్ సెంచరీలతో ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ లో ఒకరిగా నిలిచాడు. ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఓపెనర్ గా మరోసారి బరిలో దిగబోతున్నాడు. మరోవైపు గత కొంతకాలంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు కె.ఎల్.రాహుల్ పెద్దగా రాణించడం లేదు.
టీ20 వరల్డ్ కప్ తో పాటు రానున్న సిరీస్ లను దృష్టిలో పెట్టుకొని టీమ్ అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం లో తప్పు లేదని టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ సబా కరీమ్ అన్నాడు. ఇషాన్ కిషన్ లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్ కు టాప్ త్రీలో చోటు కల్పించాలంటే రోహిత్, కోహ్లి, రాహుల్ లలో ఒకరి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాల్సివస్తుందని కరీమ్ అన్నాడు. అలాంటి కఠిమైన నిర్ణయాలు తీసుకోవడంలో సెలెక్టర్లు ఏ మాత్రం వెనుకాడాల్సిన పనిలేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల దృష్ట్యా తమ ఆలోచనలను సీనియర్లతో నిర్మొహమాటంగా పంచుకోవాలని అన్నాడు.. తమకున్న అనుభవం తో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యాలు రోహిత్, కోహ్లిలలో ఉన్నాయని, అందుకు అనుగుణంగా వారి ఆలోచన తీరు మార్చుకోవాలని పేర్కొన్నాడు. అదొక్కటే కొన్ని సార్లు పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుందని చెప్పాడు. ఐర్లాండ్ , ఇంగ్లాండ్ టూర్ తర్వాత భారత్ ప్రపంచ కప్ జట్టుపై మరింత స్పష్టత వస్తుందని అభిప్రాయ పడ్డాడు.