Virat Kohli : విమర్శకులకు కోహ్లీ కౌంటర్
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ క్రీజులో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే.. పిచ్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన సందర్భాలు అనేకం. ఇక ఛేజింగ్ లో అయితే కోహ్లీకి ఉన్న సక్సెస్ రికార్డ్ మరే బ్యాటర్ కూ లేదు. ఇది మొన్నటి వరకూ... ఇప్పుడు మాత్రం కథ మారింది.
- By Hashtag U Published Date - 11:50 AM, Tue - 11 January 22

భారత టెస్ట్ జట్టు కెప్టెన్ క్రీజులో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే.. పిచ్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన సందర్భాలు అనేకం. ఇక ఛేజింగ్ లో అయితే కోహ్లీకి ఉన్న సక్సెస్ రికార్డ్ మరే బ్యాటర్ కూ లేదు. ఇది మొన్నటి వరకూ… ఇప్పుడు మాత్రం కథ మారింది. ఒకప్పుడు పరుగుల మోతతో రికార్డులపై రికార్డులు నెలకొల్పిన కోహ్లీ సెంచరీ చేసి రెండేళ్ళు దాటిపోయింది. కోహ్లీ బ్యాట్ నుండి ఒక పెద్ద ఇన్నింగ్స్ వచ్చి రెండేళ్ళు దాటిపోవడం ఇదే తొలిసారి. కెరీర్ లో తొలిసారి ఇలాంటి పేలవమైన ఫామ్ లో ఉన్నాడు విరాట్. దీంతో కోహ్లీ వ్యక్తిగత ఫాంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు కోహ్లీ కౌంటరిచ్చాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్ట్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరి కోసమో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు.
ఎప్పుడూ జట్టుకోసమే ఆడతానని, రికార్డుల గురించి పట్టించుకోనన్నాడు. కొన్నేళ్ళుగా తాను చేసిన పరుగులను చూస్తే ఇది అర్థమవుతుందన్నాడు. బయట కూర్చుని మాట్లాడే వారి గురించి తాను పట్టించుకోనన్నాడు. ఎప్పుడు క్రీజులో అడుగుపెట్టినా పరుగులు సాధించేందుకే శ్రమిస్తానని, విమర్శకుల నోళ్ళు మూయించేందుకు కాదన్నాడు. కోహ్లీ గత రెండేళ్ళుగా ఏ ఫార్మేట్ లోనూ శతకం సాధించలేదు. చివరి సారిగా 2019లో బంగ్లాదేశ్ పై సెంచరీ చేసిన విరాట్ అడపా దడపా ఇన్నింగ్స్ లు ఆడినా భారీస్కోర్లు మాత్రం చేయలేకపోతున్నాడు. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టులో అతను ఔటైన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతిని ఆడి కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కోహ్లీ మునుపటి ఆట ఏమైపోయిందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రెండో టెస్టుకు గాయంతో దూరమైన కోహ్లీ మూడో టెస్టులోనైనా రాణించి చారిత్రక సిరీస్ విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.