MS DHONI : ఎంఎస్ ధోని సంచలనం..‘కెప్టెన్ కూల్’ పేరిట ట్రేడ్ మార్క్ కైవసం!
MS DHONI : మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా చిరునవ్వుతో ఎదుర్కొనే టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తన ప్రశాంతమైన ప్రవర్తనతో 'కెప్టెన్ కూల్'గా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మన్ననలు పొందిన విషయం తెలిసిందే.
- By Kavya Krishna Published Date - 08:46 PM, Tue - 1 July 25

MS DHONI : మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా చిరునవ్వుతో ఎదుర్కొనే టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తన ప్రశాంతమైన ప్రవర్తనతో ‘కెప్టెన్ కూల్’గా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దశాబ్దాలుగా తనతో ముడిపడిన ఈ ‘కెప్టెన్ కూల్’ అనే ముద్దుపేరును ఇప్పుడు అధికారికంగా సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.తన ఐకానిక్ నిక్‌నేమ్‌పై పూర్తి హక్కుల కోసం ఆయన ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధోనికి చెందిన రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ, 2023 జూన్ 5న ‘కెప్టెన్ కూల్’ పేరు మీద ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసింది. క్రీడా శిక్షణ, కోచింగ్ సేవలు, ట్రైనింగ్ సెంటర్ల వంటి వాటికి ఈ పేరును ఉపయోగించుకునేందుకు క్లాస్ 41 కింద ఈ దరఖాస్తును సమర్పించారు. సుదీర్ఘ ప్రక్రియ అనంతరం, ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఈ దరఖాస్తును అంగీకరించి 2025 జూన్ 16న అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో ప్రచురించింది.
అయితే, ఈ ప్రక్రియ అంత సులభంగా జరగలేదని తెలుస్తోంది. తొలుత ‘కెప్టెన్ కూల్’ పేరుతో ఇప్పటికే మరో సంస్థకు ట్రేడ్‌మార్క్ ఉందని రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీనిపై ధోని న్యాయవాదుల బృందం వాదిస్తూ ‘కెప్టెన్ కూల్’ అనే పేరుకు ధోనికి విడదీయరాని సంబంధం ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ధోనికే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని స్పష్టం చేసింది. ఈ పేరు వినగానే అందరికీ ధోనినే గుర్తుకు వస్తారని తమ వాదనలను బలంగా వినిపించింది.
చివరగా ఎంఎస్ ధోని న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ, వారి అభ్యర్థనను అంగీకరించింది. ఈ ట్రేడ్‌మార్క్ ఆమోదంతో, ‘కెప్టెన్ కూల్’ అనే పేరుపై ధోనికి పూర్తి వాణిజ్య హక్కులు లభిస్తాయి. భవిష్యత్తులో క్రీడా అకాడమీలు లేదా ఇతర వాణిజ్య కార్యకలాపాలకు ఈ బ్రాండ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది ధోని వ్యక్తిగత బ్రాండ్‌ను మరింత పటిష్టం చేయడంలో కీలక ముందడుగుగా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ పేరు మీదట మిగతా కంపెనీలు, సంస్థలు ఎటువంటి వ్యాపారా కార్యకలాపాలు కొనసాగించాడినికి వీలుపడదు. ఒకవేళ ఎవరైనా సాహసం చేస్తే ట్రేడ్ మార్క్ నిబంధనలు ఉల్లంఘనల కింద ధోని వారిపై కేసు ఫైల్ చేయవచ్చును. కాగా, కెప్టెన్ కూల్ పేరుతో ట్రేడ్ మార్క్‌ను ధోని పొందడంతో ఆయనేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.