Sania Mirza: మాతృత్వంపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు!
మాతృత్వం తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని సానియా చెప్పారు. ఒక టెన్నిస్ మ్యాచ్ లేదా మెడల్ కోల్పోవడం ఒక తల్లికి చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని ఆమె అన్నారు.
- By Gopichand Published Date - 06:57 PM, Wed - 24 September 25

Sania Mirza: మాజీ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) మాతృత్వం తన జీవితాన్ని ఎలా మార్చిందో? అలాగే క్రీడ తనకు ఆత్మవిశ్వాసం, స్థితిస్థాపకతను ఎలా నేర్పిందో వివరించారు. ఇటీవల ఓ టీవీతో మాట్లాడిన సందర్భంగా ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మాతృత్వం తర్వాత మారిన దృక్పథం
ఒక మహిళ తల్లి అయిన తర్వాత సమాజం ఆమెను వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ ఒక నిర్దిష్ట పరిధిలో చూస్తుందని సానియా పేర్కొన్నారు. “ఒక మహిళ తల్లి అయితే ఆమె జీవితం ముగిసిందని చాలామంది భావిస్తారు. తన కలలను, వృత్తిని కొనసాగిస్తే, పిల్లల ఆలనా పాలన ఎవరు చూస్తారని ప్రశ్నలు వేస్తారు. కానీ ఈ పాత ఆలోచనలు ఇప్పుడు మారుతున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది మహిళా అథ్లెట్లు మాతృత్వం తర్వాత కూడా తమ క్రీడా జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు” అని ఆమె అన్నారు.
Also Read: Delhi Baba: 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా!
తన కుమారుడు ఇజహాన్ పుట్టిన తర్వాత మళ్లీ టెన్నిస్‌లోకి రావాలనే తన నిర్ణయం గురించి సానియా స్పష్టంగా మాట్లాడారు. “ఇజహాన్ తర్వాత నేను తిరిగి వస్తానని నాకు ముందే తెలుసు. అందుకే రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఆ సమయంలో నేను 23 కిలోల బరువు పెరిగాను. అది చూసి ఎలా సాధించగలనని అనుకున్నా. కానీ నాలో ఇంకా టెన్నిస్ మిగిలి ఉందని నాకు నమ్మకం ఉంది. తిరిగి వచ్చిన తర్వాత నేను విజయం సాధించాను. నా నమ్మకం సరైందే అని నిరూపించుకున్నాను” అని ఆమె వివరించారు.
గెలుపు, ఓటములపై కొత్త దృక్పథం
మాతృత్వం తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని సానియా చెప్పారు. ఒక టెన్నిస్ మ్యాచ్ లేదా మెడల్ కోల్పోవడం ఒక తల్లికి చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని ఆమె అన్నారు. “గెలిచినా, ఓడినా నా కొడుకు వచ్చి ‘ఐ లవ్ యూ’ అని కౌగిలించుకుంటాడు. నా గెలుపోటములు అతనికి ఏ మాత్రం తేడా చూపవు. ఇది నాకు జీవితంలో ఓటములను తేలికగా తీసుకునేలా చేసింది” అని ఆమె వివరించారు.
క్రీడ నేర్పే జీవిత పాఠాలు
క్రీడలు ఆత్మవిశ్వాసం, ఓటమిని అంగీకరించడం, స్థితిస్థాపకతను నేర్పిస్తాయని సానియా అభిప్రాయపడ్డారు. “ఒక మ్యాచ్‌లో మీరు పాయింట్‌ను కోల్పోయిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. లేకపోతే తర్వాతి పాయింట్ ఆడలేరు. క్రీడలు వైఫల్యం తర్వాత ఎలా తిరిగి రావాలి? నమ్మకం ఎలా ఉంచుకోవాలి, వినయంతో గెలుపును ఎలా స్వీకరించాలి వంటి ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పుతాయి. ఇటువంటి పాఠాలను మరే విద్య కూడా నేర్పదని నేను భావిస్తాను” అని ఆమె అన్నారు. కష్ట సమయంలో తోడుగా ఉండే సహాయక బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.