Khawaja Century: ఖవాజా శతకం.. తొలిరోజు ఆసీస్‌దే పైచేయి
అహ్మదాబాద్ టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయిగా నిలిచింది. 4 వికెట్లు పడగొట్టినా... ఖవాజా సెంచరీతో ఆసీస్ భారీస్కోరు దిశగా సాగుతోంది.
- Author : Maheswara Rao Nadella
Date : 09-03-2023 - 6:08 IST
Published By : Hashtagu Telugu Desk
అహ్మదాబాద్ టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయిగా నిలిచింది. 4 వికెట్లు పడగొట్టినా.. ఖవాజా సెంచరీతో (Khawaja Century) ఆసీస్ భారీస్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు హెడ్, ఖవాజా తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. వీరి పార్టనర్‌షిప్‌ను అశ్విన్ బ్రేక్ చేశాడు. హెడ్‌ను 32 రన్స్‌కు ఔట్ చేయగా.. కాసేపటికే హ్యాండ్స్‌కాంబ్‌ను ఓ సంచలన బంతితో షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 71 ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్‌కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో పడ్డ బంతి బ్యాట్‌ను మిస్స్ అయి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బ్యాటర్ చేసేది ఏమీ లేక క్రీజులో అలా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ఇదే ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను కూడా షమీ ఓ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే రెండు వికెట్లు పడినప్పటకీ.. స్మిత్, ఖవాజా (Khawaja) పార్టనర్ షిప్‌తో ఆసీస్ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. టీ బ్రేక్ తర్వాత కూడా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఖవాజా (Khawaja) తొలిరోజు ఆట చివరి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 14వ సెంచరీ. అలాగే 13 ఏళ్ళ తర్వాత భారత గడ్డపై శతకం చేసిన ఆసీస్ లెఫ్ట్ హ్యాండర్‌గా రికార్డు సృష్టించాడు. ఖవాజా ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. అటు కామెరూన్ గ్రీన్ కూడా అతనికి చక్కని సపోర్ట్ ఇచ్చాడు. ఫలితంగా ఆసీస్ తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. ఖవాజా 104 , గ్రీన్ 49 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 85 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి 10 ఓవర్లలో ఆసీస్ 56 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ 2 , అశ్విన్ 1 , జడేజా 1 వికెట్ పడగొట్టారు.
Also Read: Chigurupathi Jayaram Case: చిగురుపాటి జయరాం హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన నాంపల్లి కోర్టు