Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా వచ్చేశాడు.. ఆర్సీబీతో పోరుకు రెడీ
సోమవారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై హెడ్‌కోచ్ మహేల జయవర్ధెనె వెల్లడించారు.
- By News Desk Published Date - 08:54 PM, Sun - 6 April 25

Jasprit Bumrah: ఐపీఎల్ – 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పేలువ ప్రదర్శనతో వరుస ఓటములను చవిచూస్తోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగతా 10 మ్యాచ్‌లలో కనీసం ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించాల్సి ఉంది. ముంబై పేస్ బౌలింగ్ ను కెప్టెన్ హార్ధిక్ పాండ్యతో పాటు బౌల్ట్, దీపక్ చాహర్ నడిపిస్తున్నారు. దీపక్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా పవర్ ప్లేతోపాటు డెత్ ఓవర్లలో వికెట్లు తీయడంలో ముంబై బౌలర్లు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జస్ర్పీత్ బుమ్రా లాంటి బౌలర్ జట్టులోకి వస్తుండటంతో ముంబై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జస్ర్పీత్ బుమ్రా గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్‌కు బుమ్రా దూరంగా ఉంటున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీలో నిపుణుల పర్యవేక్షణలో గాయం నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయ్యాడు. సోమవారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై హెడ్‌కోచ్ మహేల జయవర్ధెనె వెల్లడించారు. శనివారం రాత్రి జట్టుతో కలిసిన బుమ్రా.. ఆదివారం జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లోనూ పాల్గొన్నట్లు జయవర్ధనే చెప్పారు.
BUMRAH HAS ARRIVED…!!! 🥶
– He is getting the deserving love, treating like a God, A lovely video. pic.twitter.com/bKum2Fr8yv
— Johns. (@CricCrazyJohns) April 6, 2025
బుమ్రా ప్రాక్టీస్ లో పాల్గొన్న సమయంలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ పోలార్డ్ అతన్ని ఎత్తుకొని బుమ్రా వచ్చేశాడు అంటూ తన సంతోషాన్ని ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలాఉంటే.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై బుమ్రాకు మంచి రికార్డు ఉంది. అతను 19 మ్యాచ్‌ల్లో 19.03 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు.