Allegations Against WFI Chief: రెజ్లర్ల ఆరోపణలపై ఐవోఎ కమిటీ నియమాకం
మహిళా రెజ్లర్ల మీటూ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటైంది. భారత ఒలింపిక్ సమాఖ్య ఏడుగురి సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో స్టార్ బాక్సర్ మేరీకోమ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది.
- By Gopichand Published Date - 07:00 AM, Sat - 21 January 23

మహిళా రెజ్లర్ల మీటూ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటైంది. భారత ఒలింపిక్ సమాఖ్య ఏడుగురి సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో స్టార్ బాక్సర్ మేరీకోమ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్‌తో పాటు మరో ఐదుగురు సభ్యులు ఉన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. నిరసన గళం వినిపిస్తున్న అథ్లెట్లు.. భారత ఒలింపిక్ సంఘాన్ని ఆశ్రయించారు. రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతవకలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుత ఫెడరేషన్‌ను రద్దు చేయాలని.. WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రెజ్లర్లు.
ఈ ఫిర్యాదుపై చర్చించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించారు IOA చీఫ్ పీటీ ఉష. రెజ్లర్ల ఆరోపణలపై విచారించేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆందోళన చేస్తోన్న రెజ్లర్లతో మరోసారి భేటీ అయ్యారు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్. సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించారు. కేంద్రమంత్రి, అథ్లెట్ల మధ్య గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘ సమావేశం జరిగినా.. ప్రతిష్ఠంభన వీడలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి ఠాకూర్‌తో మరోసారి సమావేశమయ్యారు అథ్లెట్లు.
Also Read: IND vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో సిరీస్ పట్టేస్తారా..?
బ్రిజ్ భూషణ్‌పై చేసిన అన్ని ఆరోపణలకు సాక్ష్యాలు సమర్పిస్తామని స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్ చెప్పారు. మరోవైపు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయనను కేంద్రం నిలువరించినట్లు తెలుస్తోంది. మీడియా ముందుకెళ్లొద్దంటూ బ్రిజ్ భూషణ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఫోన్ చేసినట్లు సమాచారం. మీడియా ముందుకెళ్తే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయని ఆయన వారించారని సమాచారం. ఇదిలా ఉంటే రెజ్లర్ల ఆందోళన తీవ్రరూపు దాలుస్తున్నా.. రెజ్లింగ్ ఫెడరేషన్ మాత్రం తగ్గేదెలే అంటోంది. నిరసన చేపడుతున్నప్లేయర్లపై FIR నమోదుకు రెడీ అయ్యింది. సీనియర్ ఓపెన్ నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్ షిప్‌కు హాజరుకాకుండా రెజ్లర్లను అడ్డుకున్నందుకు అథ్లెట్లపై కేసు పెట్టనున్నట్టు ఫెడరేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20-23 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరగాల్సిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్… రెజ్లర్ల నిరసన కారణంగా రద్దయ్యింది.