Jasprit Bumrah : గువాహటి టెస్టులో టీ బ్రేక్‌కి ముందు భారత్‌కి బ్రేక్ త్రూ!
- By Vamsi Chowdary Korata Published Date - 12:08 PM, Sat - 22 November 25
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు ఎట్టకేలకు వికెట్ దక్కింది. బ్యాటర్లకు అనుకూలించిన పిచ్‌పై సౌతాఫ్రికా ఓపెనర్లు నిలకడగా ఆడారు. బుమ్రా అద్భుత బంతితో మర్కరమ్‌ను అవుట్ చేయడతో టీమిండియాకు బ్రేక్ త్రూ లభించింది. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 82/1తో ఉంది. గువాహటిలో తొలిసారి జరుగుతున్న ఈ టెస్టులో వాతావరణం కారణంగా మ్యాచ్ ముందుగానే ప్రారంభమైంది. తొలుత టీ బ్రేక్ ఇవ్వనుండగా, ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది.
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఎట్టకేలకు వికెట్ దక్కింది. గువాహటి వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్ తయారు చేయడంతో వికెట్లు తీయడంలో బౌలర్లు శ్రమించాల్సి వస్తోంది. బుమ్రా, సిరాజ్ మెరుపు బంతులు వేసినా.. కుల్దీప్, వాషింగ్టన్ స్పిన్ తంత్రం ఉపయోగించినా వికెట్లు దొరకడం చాలా కష్టమైంది. టీ బ్రేక్‌కి ముందు ఎట్టకేలకు టీమిండియాకు బ్రేక్ త్రూ లభించింది.
గువాహటి స్టేడియం మొదటి సారిగా టెస్టు క్రికెట్‌కు అర్హత సాధించింది. ఈశాన్య ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ని ఒక అరగంట ముందుగానే ప్రారంభించారు. టాస్ గెలిచిన టెంబా బవుమా వరుసగా రెండో టెస్టులో కూడా బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. పిచ్ అన్నిరకాల పరిస్థితులకు అనుకూలించడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా నిలకడగా రాణించారు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలో వేసిన ఓ అద్భుత బంతిని ఎదుర్కొనే క్రమంలో మర్కరమ్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. అయితే, ఆ క్యాచ్ అందుకోవడంలో కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. దాంతో మర్కరమ్‌కి నాలుగు పరుగుల వద్ద తొలి లైఫ్ లభించింది. ఆ తర్వాత ఓపెనర్లు మర్కరమ్, ర్యాన్ రికెల్టన్ మరో తప్పు చేయకుండా ఇన్నింగ్స్‌ని బలంగా నిర్మించారు.
అయితే టీ బ్రేక్ ఇంకొంత సమయం ఉందనగా కెప్టెన్ రిషభ్ పంత్ బంతిని స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేతికి అందించాడు. బుమ్రా తన స్వింగ్‌తో అద్భుతంగా డెలివరీ చేయగా బంతి బ్యాట్‌కి తగిలి ఆపై వికెట్లను తాకింది. దాంతో 27వ ఓవర్‌లో భారత్‌కు బ్రే త్రూ లభించింది. 81 బంతులు ఆడిన ఎయిడెన్ మర్కరమ్ 5 ఫోర్లతో 38 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ టెస్టులో తొలి రోజు టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 82 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్ 35 పరుగులతో కొనసాగుతున్నాడు.