Ban On Pak : మరో డిజిటల్ స్ట్రైక్.. పాక్ యూట్యూబ్, స్పోర్ట్స్ ఛానళ్లపై బ్యాన్
ఆయా పాకిస్తానీ జర్నలిస్టుల(Ban On Pak) యూబ్యూబ్ ఛానళ్లను కూడా మనం చూడలేం.
- By Pasha Published Date - 11:01 AM, Mon - 28 April 25

Ban On Pak : పాకిస్తాన్‌పై భారత్ మరోసారి డిజిటల్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్ నుంచి ప్రసారమయ్యే న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై భారత్ బ్యాన్ విధించింది. ఈ జాబితాలో డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, ఏఆర్‌వై న్యూస్, బోల్ న్యూస్, సమా స్పోర్ట్స్, జీఎన్ఎన్, సునో న్యూస్, రాజీనామా మీడియా ఛానళ్లు ఉన్నాయి. వీటితో పాటు పాక్ యూట్యూబ్ ఛానళ్లు ఇర్షాద్ భట్టి, రఫ్తార్, ది పాకిస్తాన్ రెఫరెన్స్, ఉజైర్ క్రికెట్, ఉమర్ చీమా ఎక్స్‌క్లూజివ్, అస్మా షిరాజీ, మునీబ్ ఫారూఖ్ కూడా బ్యాన్ అయ్యాయి. మాజీ పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్‌ను కూడా నిషేధించారు. ఇక నుంచి ఈ యూట్యూబ్ ఛానళ్లను కానీ, టీవీ ఛానళ్లను కానీ మనం భారత్‌లో చూడలేం.
యూట్యూబ్‌లో అవి చూడలేం..
ఆయా పాకిస్తానీ జర్నలిస్టుల(Ban On Pak) యూబ్యూబ్ ఛానళ్లను కూడా మనం చూడలేం. సదరు యూట్యూబ్ ఛానళ్లను మనం తెరిస్తే.. ‘‘ఇందులోని కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అనే సందేశం కనిపిస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్’ ఖాతాను కూడా భారత్ నిలిపివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ యూట్యూబ్ ఛానళ్లపై భారత్ బ్యాన్ విధించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. త్వరలోనే పాక్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో సదరు పాక్ ఛానళ్లపై కొరడా ఝుళిపించడం గమనార్హం.
Also Read :Pak Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ ఏమయ్యాడు ? బంకర్‌లో దాక్కున్నాడా ?
ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడంపై ఫోకస్
ఇక జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడంపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజాము నుంచే ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. దోడాలోని పలు ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు.ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను భారత భద్రతా బలగాలు పేల్చేశాయి. పాక్ జాతీయులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిని.. ఉగ్రమూకలకు నిధులను, ఆయుధాలను సప్లై చేస్తున్న వారిని గుర్తించడంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.