India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రసవత్తర పోరు.. ఇరు జట్ల మధ్య బోలెడు రికార్డ్స్..!
వన్డే క్రికెట్‌లో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) జట్లు నేడు 117వ సారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
- By Gopichand Published Date - 11:18 AM, Sun - 22 October 23

India vs New Zealand: వన్డే క్రికెట్‌లో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) జట్లు నేడు 117వ సారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్ 2023 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మ్యాచ్‌గా నిలవనుంది. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇరుజట్లు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాలను ఆక్రమించాయి.
ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. నేటి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో భారత్ 58 మ్యాచ్‌లు గెలుపొందగా, కివీస్ జట్టు కూడా 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, ఏడు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం రాలేదు. అంటే పోటీ దాదాపు సమానంగానే ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లకు సంబంధించిన 10 ప్రత్యేక అంశాలు ఇవే..!
We’re now on WhatsApp. Click to Join.
– అత్యధిక జట్టు స్కోరు: ఈ రికార్డు టీమ్ ఇండియా పేరిట నమోదైంది. 8 మార్చి 2009న క్రైస్ట్‌చర్చ్ ODIలో కివీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది.
– అత్యల్ప జట్టు స్కోరు: 29 అక్టోబర్ 2016న విశాఖపట్నం ODIలో భారత్‌పై న్యూజిలాండ్ కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది.
– అతిపెద్ద విజయం: ఈ విషయంలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. 2010 ఆగస్టు 10న దంబుల్లా వన్డేలో కివీస్ జట్టు 200 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
– అతి చిన్న విజయం: 6 మార్చి 1990న వెల్లింగ్టన్ ODIలో భారత జట్టు కేవలం ఒక పరుగు తేడాతో గెలుపొందగలిగింది.
– అత్యధిక పరుగులు: మాస్టర్-బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌లలో 1750 పరుగులు చేశాడు.
– అత్యధిక సెంచరీలు: వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌ల్లో మొత్తం 6 సెంచరీలు సాధించాడు.
– అత్యుత్తమ ఇన్నింగ్స్: ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. హైదరాబాద్ వన్డేలో కేవలం 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.
– అత్యధిక వికెట్లు: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌లలో 50కి పైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్. కివీస్‌పై 51 వికెట్లు తీశాడు.
– వికెట్ వెనుక అత్యధిక అవుట్‌లు: భారత మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా న్యూజిలాండ్‌పై 36 ఔట్‌లు చేశాడు. వీటిలో 24 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లు ఉన్నాయి.
– అత్యధిక క్యాచ్‌లు: మాజీ కివీస్ ఆటగాడు రాస్ టేలర్ ఇక్కడ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌పై 19 క్యాచ్‌లు పట్టాడు.