India vs England: తొలి మ్యాచ్‌లో హైలైట్స్ ఇవే!
ఇంగ్లాండ్ టాప్ స్కోరర్ అయిన కెప్టెన్ జోస్ బట్లర్ క్యాచ్‌ను నితీష్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండవ బంతికి బట్లర్ స్క్వేర్ లెగ్ వైపు ఏరియల్ షాట్ ఆడాడు.
- By Naresh Kumar Published Date - 12:01 PM, Thu - 23 January 25

India vs England: భారత్- ఇంగ్లాండ్ (India vs England) మధ్య జరిగిన తొలి టి20లో అత్యధిక స్కోరు నమోదవుతుందని అంతా భావించారు. జొస్ బట్లర్ నేతృత్వంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు పూర్తిగా నిరాశాజనక ప్రదర్శన చేసింది. భారీ హిట్టర్లతో కూడిన ఆ జట్టు పరుగులు రాబట్టడంలో సక్సెస్ కాలేదు. టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శన ముందు ఇంగ్లిష్ బ్యాటర్లు నిలవలేకపోయారు. బట్లర్ మినహా ఎవరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. భారత్ ఇంకా 43 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.
బౌలింగ్, బ్యాటింగ్ తో అదరగొట్టిన భారత్ ఫీల్డింగ్ లోనూ అదరగొట్టింది. రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుత క్యాచ్‌లతో ఆకట్టుకున్నారు.అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కవర్స్‌లో బెన్ డకెట్‌ను క్యాచ్ అవుట్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్ ఐదవ బంతికి డకెట్ ఏరియల్ షాట్ ఆడాడు. బంతి కవర్స్ వైపు వెళుతుంది. అక్కడే ఉన్న రింకు సింగ్ వెనక్కి పరిగెత్తి తన రెండు చేతులను ముందుకు చాచి క్యాచ్ తీసుకున్నాడు.రింకు సింగ్ ఈ కష్టమైన క్యాచ్‌ను సులభంగా పట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే రింకు డై చేసినట్లు ఏ మాత్రం అనిపించలేదు. దీంతో బెన్ డకెట్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. దీని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ క్యాచ్‌ను అందుకున్నాడు.
Also Read: Davos : పారిశ్రామిక దిగ్గజాలను ‘ఆహా’ అనిపిస్తున్న‘అరకు’ సువాసనలు
ఇంగ్లాండ్ టాప్ స్కోరర్ అయిన కెప్టెన్ జోస్ బట్లర్ క్యాచ్‌ను నితీష్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండవ బంతికి బట్లర్ స్క్వేర్ లెగ్ వైపు ఏరియల్ షాట్ ఆడాడు. అయితే బట్లర్ కు టైమింగ్ కుదరలేదు. స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద ఉన్న నితీష్ రెడ్డి ముందుకు పరిగెత్తి గాల్లోకి దూకి తన రెండు చేతులను ముందుకు చాచి గ్రాస్ కి దగ్గరగా క్యాచ్ తీసుకున్నాడు. అయితే నితీష్ క్యాచ్ పట్టాడో లేదో తెలియక అంపైర్ ఒక్క క్షణం అయోమయంలో పడ్డాడు.
దీంతో థర్డ్ అంపైర్ సహాయం తీసుకున్నాడు. రీప్లేలో నితీష్ కుమార్ రెడ్డి క్లీన్ క్యాచ్ పట్టి జోస్ బట్లర్ ఇన్నింగ్స్‌ను ముగించాడని స్పష్టంగా కనిపించింది. కాగా ఆటగాళ్ల ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా భారత జట్టు తొలి టి20ని 7 వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు మొత్తం 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 12.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య సిరీస్‌లో రెండో మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది.