Old Trafford: ఓల్డ్ ట్రాఫోర్డ్ లో భారత్ రికార్డు ఎలా ఉందంటే…
మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్...2019 వన్డే వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది ఇదే చోట..
- By Naresh Kumar Published Date - 03:27 PM, Sun - 17 July 22

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్…2019 వన్డే వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది ఇదే చోట..సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయిన ఇదే స్టేడియంలో మళ్లీ మూడేళ్లకు ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ డిసైడర్ లో తలపడబోతోంది. నిజానికి ఈ వేదికలో భారత్ రికార్డ్ అంత బాగాలేదు. ఓవరాల్ గా ఇక్కడ 11 మ్యాచ్ లు ఆడిన భారత్ అయిదు విజయాలు సాధించి…ఆరింటిలో ఓడిపోయింది. ఇక ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ తో గత రికార్డులు ప్రతికూలంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ తో ఇదే వేదిక పై నాలుగు మ్యాచ్ ల్లో తలపడితే కేవలం ఒకసారి మాత్రమే గెలిచింది. మిగిలిన మూడు మ్యాచ్ లలో ఆతిథ్య జట్టుదే పై చేయిగా ఉంది.
ఇక పిచ్ విషయానికి వస్తే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా. గత 9 వన్డేల్లో ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అటు మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని సమాచారం. ఆకాశం మేఘవృతమై ఉన్నప్పటికీ పూర్తి మ్యాచ్ జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తుది జట్టు విషయంలో భారత్ ఎటువంటి మార్పు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. కోహ్లీ ఆడనుండడంతో దీపక్ హుడా బెంచ్ కే పరిమితం కానున్నాడు. అటు బౌలింగ్ లో ప్రసిద్ధ కృష్ణ పర్వాలేదనిపిస్తుండడంతో తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ బ్యాటింగ్ డెప్త్ దిశగా ఆలోచిస్తే మాత్రం శార్దూల్ కు అవకాశం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.