Ind vs Wi 3rd T20: రాణించిన పావెల్ , కింగ్…టీమిండియా టార్గెట్ 160
సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ కు విండీస్ 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు
- Author : Praveen Aluthuru
Date : 08-08-2023 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
Ind vs Wi 3rd T20: సిరీస్ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ కు విండీస్ 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు కింగ్ , మేయర్స్ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించారు. వీరి పార్టనర్ షిప్ ను అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. కింగ్ 42 , మేయర్స్ 25 రన్స్ చేశారు. తర్వాత నికోలస్ పూరన్ ధాటిగా ఆడినా..20 రన్స్ కు కులదీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మిగిలిన బ్యాటర్లు వేగంగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగారు. చివర్లో భారత స్పిన్నర్ కులదీప్ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టాడు. అయితే చివరి రెండు ఓవర్లలో కెప్టెన్ రోవ్ మెన్ పావెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కులదీప్ 3 , అక్షర్ పటేల్, ముకేష్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
తొలి రెండు మ్యాచ్‌లు ఓడి 0-2తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్ స్థానంలో అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులో చేరాడు. మరోవైపు విండీస్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ కు చోటు దక్కింది.