Virat Kohli: 15 గంటల వ్యవధిలో రెండో మ్యాచ్.. అలసిపోయానంటూ కోహ్లీ కామెంట్..!
శ్రీలంకతో జరిగే మ్యాచ్ భారత్ ఫిట్ నెస్ కు పరీక్షగానే చెప్పాలి. ఎందుకంటే పాక్ తో మ్యాచ్ లో ఆటగాళ్లు బాగానే అలసిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఇదే విషయం చెప్పాడు.
- By Naresh Kumar Published Date - 01:16 PM, Tue - 12 September 23

Virat Kohli: ఆసియా కప్ ను వెంటాడుతున్న వర్షంతో అటు నిర్వాహకులు, ఇటు అభిమానుల్లో చికాకు కనిపిస్తోంది. ముఖ్యంగా మ్యాచ్ లు రద్దవడం ఒక కారణమైతే.. షెడ్యూల్ మరింత టైట్ అయిపోయింది. రిజర్వ్ డేలు పెట్టడంతో భారత్ ఇప్పుడు వరుసగా మ్యాచ్ లు ఆడాల్సి వస్తోంది. తాజాగా 15 గంటల వ్యవధిలో రెండో మ్యాచ్ ఆడనుంది. అసలు షెడ్యూల్ ప్రకారం అయితే ఈ పాక్ తో మ్యాచ్ ముగిశాక ఒక రోజు గ్యాప్ తర్వాత ఆడాలి. అయితే పాకిస్థాన్ తో మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. దీంతో లంకతో మ్యాచ్ కు ముందు రోజు భారత్ కు రెస్ట్ లేకుండా పోయింది. దీంతో ఫాన్స్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా పై మండిపడుతున్నారు. అసలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని శ్రీలంకలో మ్యాచ్ లు పెట్టడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు శ్రీలంకతో జరిగే మ్యాచ్ భారత్ ఫిట్ నెస్ కు పరీక్షగానే చెప్పాలి. ఎందుకంటే పాక్ తో మ్యాచ్ లో ఆటగాళ్లు బాగానే అలసిపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఇదే విషయం చెప్పాడు. జట్టులో అందరి కంటే ఫిట్ గా ఉండే ప్లేయర్, 35 ఏళ్ల వయసులోనూ వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే కోహ్లీ ఈ కామెంట్ చేయడం కాస్త ఆశ్చర్యమే. ఇంటర్వ్యూని త్వరగా ముగించాలని, చాలా అలసిపోయానంటూ విరాట్ కోహ్లి ముందుగానే సంజయ్ మంజ్రేకర్ ను కోరాడు. ఈ మ్యాచ్ లో వన్డేల్లో తన 47వ సెంచరీ చేసిన కోహ్లి.. వికెట్ల మధ్య చాలా పరుగెత్తాడు. అతడు చేసిన 122 పరుగుల్లో బౌండరీల రూపంలో కేవలం 54 రన్స్ రాగా.. మిగిలిన పరుగులన్నీ వికెట్ల మధ్య పరుగెత్తినవే.
Also Read: India vs Sri Lanka: ఫైనల్ కు అడుగు దూరంలో భారత్.. నేడు శ్రీలంకతో ఢీ..!
పైగా కొన్ని గంటల వ్యవధిలోనే శ్రీలంకతో మ్యాచ్ ఉండటంతో కోహ్లి నోటి నుంచి అలసిపోయానన్న మాట వినిపించింది. తన 15 ఏళ్ల కెరీర్లో తొలిసారి ఇలా ఓ వన్డే మ్యాచ్ ఆడిన కొన్ని గంటల్లోనే మరో మ్యాచ్ ఆడాల్సి వస్తోందని విరాట్ చెప్పాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లోనే విరాట్ వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రికార్డు క్రియేట్ చేశాడు.