Dinesh Karthik: పుజారా,రహానే స్థానాలను భర్తీ చేసేది వారే.. డీకే చెప్పిన క్రికెటర్లు ఎవరో తెలుసా ?
అంతర్జాతీయ క్రికెట్ లో గిల్ నైపుణ్యాన్ని ఇప్పటికే మనం చూశామన్న డీకే రానున్న రోజుల్లో మరింత అత్యుత్తమ క్రికెట్ ఆడతాడని జోస్యం చెప్పాడు. టెస్ట్ క్రికెట్ లోనూ గిల్ నుంచి కొన్ని మరిచిపోలేని ఇన్నింగ్స్ లు వస్తాయన్నాడు.
- By Praveen Aluthuru Published Date - 10:39 PM, Mon - 2 September 24

Dinesh Karthik: భారత క్రికెట్ లో చటేశ్వర పుజారా, అజంక్య రహానేలకు ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా టెస్టుల్లో వీరిద్దరి బ్యాటింగ్ సత్తా గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే ప్రత్యర్థి బౌలర్లకు తలనొప్పే.. ఎన్నోసార్లు వీరిద్దరూ భారత జట్టు ఓటములకు అడ్డుగోడలా నిలిచారు. ప్రస్తుతం పుజారా, రహానే రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారు. అధికారికంగా ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకపోయినప్పటికీ మళ్ళీ జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పలువురు యువక్రికెటర్లు పోటీ ఉండడమే దీనికి కారణం. అయితే వీరిద్దరి స్థానాలను భర్తీ చేసే సత్తా ఎవరికుందన్న దానిపై మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ వీరిద్దరికీ సరైన రీప్లేస్ మెంట్ ప్లేయర్స్ గా అభివర్ణించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో గిల్ నైపుణ్యాన్ని ఇప్పటికే మనం చూశామన్న డీకే రానున్న రోజుల్లో మరింత అత్యుత్తమ క్రికెట్ ఆడతాడని జోస్యం చెప్పాడు. టెస్ట్ క్రికెట్ లోనూ గిల్ నుంచి కొన్ని మరిచిపోలేని ఇన్నింగ్స్ లు వస్తాయన్నాడు. 24 ఏళ్ళ గిల్ ఇప్పటి వరకూ 25 టెస్టుల్లో 1492 పరుగులు చేశాడు. దీనిలో 4 శతకాలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక రహానేకు రీప్లేస్ మెంట్ గా భావిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్న విషయాన్ని దినేశ్ కార్తీక్ గుర్తు చేాశాడు. ఆస్ట్రేలియా పరిస్థితులు సర్ఫరాజ్ బ్యాటింగ్ స్టైల్ కు సరిపోతాయని డీకే విశ్లేషించాడు.
ఇక 26 ఏళ్ళ సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది టెస్ట్ అరంగేట్రం చేశాడు. మూడు టెస్టుల్లోనూ ఆకట్టుకున్న సర్ఫరాజ్ 200 పరుగులు చేయగా.. మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫిట్ నెస్ సమస్యల కారణంగా గత ఏడాది జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ గతంతో పోలిస్తే బరువు తగ్గాదు. కాగా రానున్న బంగ్లాదేశ్ సిరీస్ లో వీరిద్దరూ ఎలా రాణిస్తారనేది చూడాలి.
Also Read: IND vs BAN Test: టెస్ట్ జట్టులోకి కోహ్లీ,పంత్ రీఎంట్రీ… బంగ్లాతో సిరీస్ కు భారత్ జట్టు ఇదే