LSG beats RCB: స్టోయినిస్, పూరన్ విధ్వంసం… బెంగుళూరుకు షాక్ ఇచ్చిన లక్నో
ఐపీఎల్ 16వ సీజన్ లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు కిక్ ఇచ్చింది. చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది.
- By Naresh Kumar Published Date - 11:42 PM, Mon - 10 April 23

LSG beats RCB: ఐపీఎల్ 16వ సీజన్ లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు కిక్ ఇచ్చింది. చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది. హై ఓల్టేజ్ టెన్షన్ ఫైట్ లో లక్నో 1 వికెట్ తేడాతో విజయం సాధించింది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే బ్యాటర్లకు పండగే..ఇలాంటి పిచ్ పై కోహ్లీ, డుప్లెసిస్ , మాక్స్ వెల్ లాంటి బ్యాటర్స్ చెలరేగకుండా ఉంటారా..మరోసారి తమ బ్యాట్ కు పనిచెబుతూ ఈ ముగ్గురూ చెలరేగిపోవడంతో బెంగళూరు భారీస్కోర్ చేసింది.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
— IndianPremierLeague (@IPL) April 10, 2023
మొదట బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 96 పరుగులు జోడించారు. ఈ సీజన్ లో ఫామ్ అందుకున్న కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తనదైన క్లాసిక్ స్ట్రోక్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు. కోహ్లీ షాట్లకు స్టేడియం హోరెత్తిపోయింది. అటు డుప్లెసిస్ కూడా ధాటిగా ఆడాడు.
కోహ్లీ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని అమిత్ మిశ్రా విడదీసాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్ కూడా రెచ్చిపోయాడు. ఒకవైపు డుప్లెసిస్, మరోవైపు మాక్స్ వెల్ పోటాపోటీగా సిక్సర్లు బాదేశారు. డుప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 రన్స్ చేయగా…మాక్స్ వెల్ 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. మాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ ను కృనాల్ పాండ్య వదిలేయడం కూడా కలిసొచ్చింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లకు 212 పరుగులు చేసింది.
ఛేజింగ్ లో ఆరంభం నుంచే లక్నో సూపర్ జెయింట్స్ తడబడింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ కైల్ మేయర్స్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీపక్ హుడా 9, కృనాల్ పాండ్యా కూడా నిరాశపరిచారు. కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు. అయితే స్టోయినిస్ మెరుపు హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన స్టోయినిస్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ తో కలిసి నాలుగో వికెట్ కు 76 రన్స్ జోడించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.
అయితే స్టోయినిస్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులకు ఔటవగా.. కాసేపటికే రాహుల్ కూడా వెనుదిరిగాడు. దీంతో లక్నో కష్టాల్లో పడింది. ఈ దశలో నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్ తో సునామీ సృష్టించాడు. కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అటు బదౌని కూడా చక్కని సపోర్ట్ ఇవ్వడంతో లక్నో విజయం దిశగా సాగింది. అయితే పూరన్ ఔటవడం, చివర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. చివరి బంతికి అవేష్ ఖాన్ సింగిల్ తీయడంతో బెంగుళూరుకు ఓటమి తప్పలేదు.