Virat Kohli Team: ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్!
E1 సీఈఓ, వ్యవస్థాపకుడు రోడి బాస్సో ఈ విజయంపై విరాట్ కోహ్లీ.. ఆది, జాన్ (డ్రైవర్), సారా (డ్రైవర్), టీమ్ బ్లూ రైజింగ్ మొత్తాన్ని అభినందించారు.
- By Gopichand Published Date - 03:40 PM, Sun - 20 July 25

Virat Kohli Team: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను జూన్ 3న 6 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. ఇది RCB చరిత్రలో 18 సంవత్సరాలలో మొదటి ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గొప్ప పండుగను తీసుకొచ్చింది. అయితే ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీకి చెందిన మరో టీమ్ (Virat Kohli Team) ఘనవిజయం సాధించింది. ఆ విశేషాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం!
E1 సిరీస్‌లో విరాట్ కోహ్లీ ‘టీమ్ బ్లూ రైజింగ్’ విజయం
ఐపీఎల్ విజయానంతరం విరాట్ కోహ్లీకి మరో టైటిల్ దక్కింది. అతను సహ-యజమానిగా ఉన్న టీమ్ బ్లూ రైజింగ్ (Team Blue Rising), E1 సిరీస్‌లో మొదటిసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, ఆది మిశ్రాతో కలిసి ఈ జట్టులో భాగస్వామి. టీమ్ బ్లూ రైజింగ్, లెబ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, రాఫెల్ నాదల్ వంటి ప్రపంచ దిగ్గజ క్రీడాకారుల జట్లను ఓడించి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొనాకోలో జరిగిన E1 రేసింగ్‌లో ఈ విజయం నమోదైంది.
E1 సీఈఓ, వ్యవస్థాపకుడు రోడి బాస్సో ఈ విజయంపై విరాట్ కోహ్లీ.. ఆది, జాన్ (డ్రైవర్), సారా (డ్రైవర్), టీమ్ బ్లూ రైజింగ్ మొత్తాన్ని అభినందించారు. “మొనాకోలో జరిగిన E1 రేసింగ్ అద్భుతమైన రేసింగ్‌లలో ఒకటి. నీటిపై రేసింగ్‌ను నిర్వహించడం ద్వారా క్రీడా ప్రపంచంలో ఒక కొత్త ఆదర్శాన్ని స్థాపిస్తున్నాము” అని రోడి బాస్సో అన్నారు. ఈ రెండు విజయాలు విరాట్ కోహ్లీ క్రీడా రంగంలో ఆటగాడిగానే కాకుండా జట్టు యజమానిగా కూడా ఎంతటి విజయాన్ని సాధించగలడో చూపిస్తున్నాయి.
Also Read: Lal Darwaza Bonalu: ఘనంగా లాల్ దర్వాజ బోనాలు.. అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బోనం!
టీమ్ బ్లూ రైజింగ్ వివరాలు
టీమ్ బ్లూ రైజింగ్ (Team Blue Rising) అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ పవర్‌బోట్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ అయిన E1 సిరీస్‌లో పాల్గొన్న జట్టు. ఈ జట్టుకు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సహ-యజమానిగా ఉన్నారు.
యజమానులు: విరాట్ కోహ్లీ, స్పోర్ట్స్ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆది మిశ్రా ఈ జట్టుకు సహ-యజమానులు. విరాట్ కోహ్లీ క్రీడా రంగంలో తనకున్న కీర్తిని, ప్రభావాన్ని ఉపయోగించి సస్టైనబుల్ స్పోర్ట్స్ పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాడు.
E1 సిరీస్: ఈ సిరీస్ పూర్తిగా ఎలక్ట్రిక్ “రేస్‌బర్డ్స్” (RaceBirds) అనే పవర్‌బోట్‌లను ఉపయోగించి నిర్వహించబడుతుంది. ఈ రేసింగ్ ద్వారా నీటిపై క్రీడలకు కొత్త కోణాన్ని తీసుకురావడంతో పాటు, సుస్థిరమైన సాంకేతికతలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
డ్రైవర్లు: టీమ్ బ్లూ రైజింగ్ డ్రైవర్లుగా జాన్ పీటర్స్, సారా మిసిర్ వ్యవహరిస్తున్నారు. మొనాకోలో జరిగిన E1 సిరీస్ రేసులో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
ప్రముఖ పోటీదారులు: E1 సిరీస్‌లో విరాట్ కోహ్లీ టీమ్ బ్లూ రైజింగ్ మాత్రమే కాదు.. లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్), టామ్ బ్రాడీ (అమెరికన్ ఫుట్‌బాల్), రాఫెల్ నాదల్ (టెన్నిస్), మార్క్ ఆంథోనీ (గాయకుడు), డిడియర్ డ్రోగ్బా (ఫుట్‌బాల్), మార్సెల్ క్లెయిర్ వంటి ప్రపంచ దిగ్గజ క్రీడాకారులు, ప్రముఖుల జట్లు కూడా ఉన్నాయి. ఈ పోటీదారులు అందరూ తమ జట్లతో E1 సిరీస్‌లో టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.