వచ్చే ఐపీఎల్ లో ఫ్రాంచైజీల కోచ్ లు ఎవరో తెలుసా ?
ఐపీఎల్ 15వ సీజన్ కు ఫ్రాంచైజీల సన్నాహాలు మొదలయ్యాయి.ఒకవైపు ఆటగాళ్ళ వేలంపై దృష్టి పెడుతూనే తమ జట్లకు సంబంధించి కోచ్ , సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించుకునే పనిని పూర్తి చేసేసాయి. ఒక్క అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తప్పిస్తే.. మిగిలిన జట్లన్నీ కూడా కోచ్ లను ఎంపిక చేసుకున్నాయి.
- By Hashtag U Published Date - 03:57 PM, Tue - 4 January 22

ఐపీఎల్ 15వ సీజన్ కు ఫ్రాంచైజీల సన్నాహాలు మొదలయ్యాయి.ఒకవైపు ఆటగాళ్ళ వేలంపై దృష్టి పెడుతూనే తమ జట్లకు సంబంధించి కోచ్ , సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించుకునే పనిని పూర్తి చేసేసాయి. ఒక్క అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తప్పిస్తే.. మిగిలిన జట్లన్నీ కూడా కోచ్ లను ఎంపిక చేసుకున్నాయి. ఈ సారి కొత్త ఎంట్రీ ఇచ్చిన అహ్మదాబాద్ కోచ్ ఇంకా ఫైనల్ కాకున్నా… భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేరు వినిపిస్తోంది. బీసీసీఐ నుండి ఆ ఫ్రాంచైజీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నెహ్ర పేరును ప్రకటించే అవకాశముంది. గతంలో నెహ్రా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరురు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు.
మరో కొత్త ఫ్రాంచైజీ లక్నోకు జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గతంలో పంజాబ్ జట్టుకు పనిచేసిన అనుభవం ఉన్న ఫ్లవర్ తో పాటు భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ దాహియా అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. అలాగే మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ను లక్నో యాజమాన్యం మెంటర్ గా నియమించింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ గా కివీస్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ కొనసాగతున్నాడు. అటు రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర బాధ్యతలు తీసుకోనున్నాడు.
ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ టీమ్ లో ఎటువంటి మార్పులూ జరగలేదు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఢిల్లీ ప్రధాన కోచ్ గా కొనసాగనున్నాడు. పాంటింగ్ డిప్యూటీగా భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ నే కొనసాగించాలని ఢిల్లీ యాజమాన్యం నిర్ణయించింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ గా టామ్ మూడీ మళ్లీ తిరిగి బాధ్యతలు అందుకోనున్నాడు. సన్ రైజర్స్ సపోర్టింగ్ స్టాఫ్ లో డేల్ స్టెయిన్, మురళీధరన్, సైమన్ కటిచ్ , బ్రయాన్ లారా సేవలను వినియోగించుకోనుంది.
మరోవైపు ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కోచ్ గా మహేళా జయవర్థనే కంటిన్యూ కానున్నాడు. గత సీజన్ లో పెద్దగా ఆకట్టుకోని ముంబై ఈ సారి జట్టు కూర్పులో మార్పులపైనా దృష్టి పెట్టనుంది. కాగా ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ గా సంజయ్ బంగర్ నియమితుడయ్యాడు. భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా పని చేసిన అనుభవంతో బెంగళూరు టైటిల్ కరువు తీరుస్తాడని ఆశిస్తున్నారు. అటు కోల్ కతా నైట్ రైడర్స్ కోచ్ గా బ్రెండన్ మెక్ కల్లమ్ , పంజాబ్ కింగ్స్ కోచ్ గా అనిల్ కుంబ్లే వ్యవహరించనున్నారు..