Chepauk: చెపాక్ లోనూ మనదే పైచేయి, ఇంగ్లాండ్ బలహీనత అదే!
ఇంగ్లాండ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో ఆ జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్ ని ఆడించారు. ఆదిల్ రషీద్ ఒక్కడికే తుది జట్టులో చోటు కల్పించారు. లియామ్ లివింగ్‌స్టోన్ ఒక పార్ట్-టైమ్ స్పిన్నర్.
- By Naresh Kumar Published Date - 05:02 PM, Fri - 24 January 25

Chepauk: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు రెండవ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ (Chepauk) స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తుండగా, టీమిండియా అదే జోరును కొనసాగించాలి అనుకుంటుంది. ఆరంభం మ్యాచ్ లో జోస్ బట్లర్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఇక టీమిండియా తరుపున అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ లో అభిషేక్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో విలయతాండవం చేశాడు. తద్వారా అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీని కేవలం 20 బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు. కానీ చెన్నై పిచ్ పై ఆ దూకుడు కొనసాగించడం కష్టమే అంటున్నారు పిచ్ విశ్లేషకులు.
రెండో టి20లో చెపాక్ పిచ్ కీలక పాత్ర పోషించనుంది. గెలుపు ఓటములు పిచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు పిచ్ ని పరిశీలించిన తరువాతే తుది జట్టును నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ కి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెన్నై పిచ్ ని పరిశీలించనున్నారు. చెన్నై పిచ్ నెమ్మదిగా ఉంటుంది. స్పిన్నర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లను దింపింది. రవి బిష్ణోయ్ తో పాటు వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ తుది జట్టులో ఉన్నారు. అయితే చిదంబరం పిచ్‌ని చూస్తే ఈ ముగ్గురు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.
Also Read: ICC Mens ODI Team: ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఇదే.. టీమిండియాకు షాక్!
ఇంగ్లాండ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో ఆ జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్ ని ఆడించారు. ఆదిల్ రషీద్ ఒక్కడికే తుది జట్టులో చోటు కల్పించారు. లియామ్ లివింగ్‌స్టోన్ ఒక పార్ట్-టైమ్ స్పిన్నర్. ఇప్పుడు అతన్ని బట్లర్ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. చెన్నై పిచ్‌ను పరిశీలిస్తే బట్లర్ ఒక మార్పు చేసి లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. మరో ఆటగాడు జాకబ్ బెథెల్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. కాగా టీమిండియాతో పోలిస్తే ఇంగ్లాండ్ స్పిన్ దళం బలహీనంగా కనిపిస్తోంది. ఇది వారికి తలనొప్పిగా మారవచ్చు. ఈ పరిస్థితిలో ఇంగ్లాండ్ పూర్తిగా బ్యాటింగ్‌పై ఆధారపడవలసి ఉంటుంది.