Harmanpreet Kaur: చరిత్ర సృష్టించేందుకు ఇది ఓ అవకాశం: హర్మన్‌ప్రీత్ కౌర్
కెప్టెన్ మాట్లాడుతూ.. సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌ను అభిమానులందరికీ ప్రత్యేకంగా మార్చాలని కోరుకుంటున్నామని తెలిపారు.
- By Gopichand Published Date - 04:31 PM, Sat - 27 September 25

Harmanpreet Kaur: స్వదేశంలో జరగనున్న ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025ను పురస్కరించుకుని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తీవ్ర ఉత్సాహంతో ధీమాతో మాట్లాడారు. ఈ టోర్నమెంట్ భారత క్రికెట్ జట్టుకు కేవలం పోటీ మాత్రమే కాదని “చరిత్ర సృష్టించడానికి లభించిన ఒక అవకాశం” అని ఆమె స్పష్టం చేశారు.
కెప్టెన్ మాట్లాడుతూ.. సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌ను అభిమానులందరికీ ప్రత్యేకంగా మార్చాలని కోరుకుంటున్నామని తెలిపారు. “ట్రోఫీని గెలవాలనే ఆకాంక్షతో టోర్నమెంట్‌ను చిరస్మరణీయం చేసుకోవడానికి జట్టుగా, వ్యక్తిగతంగా మేము ప్రేరణ పొందుతున్నాము” హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొన్నారు.
ఐసీసీ ట్రోఫీ కోసం అడ్డంకిని ఛేదిస్తాం!
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవాలనే తపన జట్టులో పెరిగిందని కెప్టెన్ వెల్లడించారు. “జట్టుగా మెరుగవడానికి ఈ సన్నద్ధత మాకు ఎంతో నేర్పింది. భారత జట్టు కొంతకాలంగా పురోగతి సాధిస్తోంది. ఈసారి మేము పెద్ద అడుగులు వేసి, ఆ అడ్డంకిని ఛేదించి ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని ధీమా వ్యక్తం చేశారు. పోటీ గట్టిగా ఉన్నప్పటికీ తమ నైపుణ్యాలు, సన్నద్ధతపై జట్టుకు పూర్తి నమ్మకం ఉందని కెప్టెన్ స్పష్టం చేశారు. స్వదేశంలో, విదేశాలలో సాధించిన ఇటీవలి విజయాలు జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని, ఆ ఊపును ప్రపంచ కప్‌లోనూ కొనసాగిస్తామని తెలిపారు.
Also Read: Sheetal Devi: చరిత్ర సృష్టించిన శీతల్ దేవి.. చేతులు లేకపోయినా!!
సన్నాహాలు, జట్టు కూర్పు
ప్రపంచ కప్‌కు ముందు విశాఖపట్నంలో, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో జరిగిన శిక్షణా శిబిరాలతో తమ సన్నాహాలు సక్రమంగా సాగాయని కెప్టెన్ తెలియజేశారు. ప్రస్తుత ప్రపంచ కప్ జట్టులో యువత, అనుభవం సమతుల్య సమ్మేళనం ఉందని తెలిపారు. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ వంటి అద్భుతమైన ప్రతిభ ఉంది. బౌలింగ్‌లో రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి తో పాటు యువ క్రీడాకారులు క్రాంతి గౌడ్, ఎన్ శ్రీ చరణి, రాధా యాదవ్ ఉన్నారు. ఆల్ రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ, స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్ రూపంలో కీలకమైన ఆల్‌రౌండర్లు జట్టుకు బలంగా ఉన్నారు.
అభిమానుల మద్దతు తమ విజయానికి కీలకం అని పేర్కొన్న కెప్టెన్ ఈ హోమ్ వరల్డ్ కప్‌లో కూడా వారి సానుకూల శక్తి జట్టుకు మరింత సహాయపడుతుందని ఆకాంక్షించారు. “సమతుల్యమైన జట్టుతో అంకితభావంతో కూడిన సన్నద్ధతతో.. విజయం కోసం ఆకలితో ఉన్న ఈ భారత జట్టు భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉంది” అంటూ తమ సందేశాన్ని ముగించారు.