Jasprit Bumrah : లంకతో వన్డేల నుంచి బూమ్రా ఔట్
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు (India) షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకున్నాడనుకున్న
- Author : Maheswara Rao Nadella
Date : 09-01-2023 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకున్నాడనుకున్న పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా (Jasprit Bumrah) శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడడం లేదు. టీ ట్వంటీ సిరీస్‌కు అతన్ని పక్కన పెట్టిన బీసీసీఐ వన్డేలకు ఎంపిక చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పాటికే బూమ్రా జట్టుతో కలవాల్సి ఉంది. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడమే బూమ్రా (Jasprit Bumrah) తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఫిట్‌నెస్ లేకుండా ఆడిస్తే మళ్ళీ గాయం తిరగబెట్టే అవకాశముండడంతో రిస్క్ తీసుకోలేదని బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. తాజా పరిణామాలతో బూమ్రా గౌహతి వెళ్ళకుండా బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉండిపోయాడు. అయితే ఈ ఏడాది కీలక టోర్నీలు ఉండడమే బూమ్రాను తప్పించేందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్, డబ్ల్యూటీఎ (WTA) ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్ ఉండడంతో హడావుడిగా బూమ్రాను సిరీస్‌లు ఆడేంచలేమని బోర్డు పెద్దలు చెబుతున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా లంకతో వన్డే సిరీస్ కోసం పేసర్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. షమీ, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, సిరాజ్ వంటి పేసర్లు అందుబాటులో ఉన్నారు. దీంతో బూమ్రా (Jasprit Bumrah) లేకున్నా బౌలింగ్ స్ట్రాంగ్‌గానే ఉందని అంచనా. లంకపై బూమ్రాను ఆడించి మళ్ళీ గాయాల పాలైతే ప్రధాన టోర్నీలకు ఈ స్టార్ పేసర్ దూరమయ్యే అవకాశముంది. అందుకే ఉద్ధేశపూర్వకంగానే తప్పించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కావాలనుకుంటే కివీస్‌తో వన్డేలకు ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. బూమ్రా గత ఏడాది ఆసియాకప్ కు ముందే గాయపడి కోలుకున్నట్టు కనిపించినా ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తాయి. దీంతో అప్పటి నుంచీ ఈ స్టార్ పేసర్ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ప్రపంచకప్‌తో పాటు కివీస్ టూర్, బంగ్లాదేశ్ టూర్‌ల నుంచి వైదొలిగాడు.
Also Read: Sania Mirza : టెన్నిస్ స్టార్ సానియా నికర ఆస్తులు దాదాపు రూ. 200 కోట్లు!!