Kohli vs Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీస్… తగ్గేదేలే అంటున్న గంగూలీ
గత కొన్ని నెలలుగా టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాకుండా ఇతర కారణాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీ20 సారధ్య బాధ్యతలనుంచి తప్పుకున్న కోహ్లీ, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
- By Hashtag U Published Date - 08:51 AM, Fri - 21 January 22

గత కొన్ని నెలలుగా టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాకుండా ఇతర కారణాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీ20 సారధ్య బాధ్యతలనుంచి తప్పుకున్న కోహ్లీ, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. తాజాగా టెస్టు కెప్టెన్సీకి సైతం గుడ్‌బాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కోహ్లీకి సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు విరాట్ కోహ్లీ నిర్వహించిన విలేకరుల సమావేశం తరువాత బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అతడిపై కోపంగా ఉన్నాడు. దీంతో కోహ్లీకి షోకాజ్ నోటీసు పంపే యోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. షోకాజ్ నోటీస్ అంశంపై
గంగూలీ బీసీసీఐలోని ఇతర సభ్యులతో చర్చించారు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు కోహ్లీ సౌరవ్ గంగూలీపై ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని విరాట్ కోహ్లీని కోరినట్లు సౌరవ్ గంగూలీ తెలిపాడు. తననెవరూ ఈ విషయంలో సంప్రదించలేదని కోహ్లీ మీడియా ముందే చెప్పాడు. టీ20 కెప్టెన్సీ పగ్గాలు వదులుకున్న కోహ్లీ నిర్ణయాన్ని, అతడి ఆలోచనను స్వాగతిస్తున్నామని గంగూలీ అన్నాడు. ఈ ప్రకటన భారత క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. అప్పటి నుంచి కోహ్లీ వర్సెస్ గంగూలీ అన్నట్లు సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అయితే ఇదే విషయమై సౌరవ్ గంగూలీ షోకాజ్ నోటీసును సిద్ధం చేశాడని.. దానిని విరాట్ కోహ్లీకి పంపబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
గంగూలీ ని అడ్డుకున్న బోర్డు సభ్యులు:
కోహ్లి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన సౌరవ్ భారత క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడని సమాచారం. అయితే గంగూలీని అలా చేయకుండా బీసీసీఐ సభ్యులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు టెస్ట్ కెప్టెన్‌కు షోకాజ్ నోటీసులు పంపడం అనేది సరైంది కాదని బోర్డు సభ్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో సభ్యుల అభిప్రాయాన్ని సౌరవ్ గంగూలీ అంగీకరించాడని టాక్. టెస్ట్ సిరీస్ ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ కెప్టెన్సీకి కూడా టాటా చెప్పేశాడు. దీంతో కేవలం విరాట్ టీమ్ ఇండియా లో ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సౌరవ్ గంగూలీతో కోహ్లీ మాట్లాడలేదు. విరాట్ తన నిర్ణయాన్ని జట్టులోని ఆటగాళ్లకు తెలిపి ఆ మరుసటి రోజు సోషల్ మీడియాలో టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. పనిలో పనిగా తనకు ఇన్నాళ్లు ఎంతో సపోర్ట్ గా నిలిచిన రవిశాస్త్రి భాయ్ ను తనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి, ప్రోత్సహించి, అండగా నిలిచిన ఎంఎస్ ధోనీకి కృతజ్ఞతలు చెప్తూ విరాట్ కోహ్లీ తన అభిమానాన్ని చాటుకున్నాడు. కనీసం గంగూలీ పేరును ఎక్కడా కూడా కోహ్లీ మెన్సన్ చేయకపోవడం గమనార్హం.