IND W vs BAN: భారత్ కు అంపైర్ల షాక్… బంగ్లాదేశ్ మహిళలతో మూడో వన్డే టై
బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు నెరవేరలేదు. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో మ్యాచ్ టైగా ముగిసింది.
- By Praveen Aluthuru Published Date - 11:32 PM, Sat - 22 July 23

IND W vs BAN: బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు నెరవేరలేదు. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో మ్యాచ్ టైగా ముగిసింది. అంపైరింగ్ తప్పిదాలే టై అవడానికి కారణమంటూ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 225 పరుగులు చేసింది. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో బంగ్లా ఓపెనర్లు రాణించారు. సుల్తానా, ఫర్హానా తొలి వికెట్ కు 93 పరుగులు జోడించారు. సుల్తానా హాఫ్ సెంచరీ చేయగా.. ఫర్హానా సెంచరీతో బంగ్లాకు మంచి స్కోర్ అందించింది. భారత బౌలర్లలో స్నేహా రాణా 2 వికెట్లు పడగొట్టింది.
226 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 4, వికెట్ కీపర్ భాటియా 5 పరుగులకే ఔటయ్యారు. అయితే స్మృతి మంధాన , హర్లీన్ డియోల్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 107 పరుగులు జోడించారు. హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ నిరాశపరచడం… కీలక సమయంలో స్మృతి మంధాన, డియోల్ ఔటవడం భారత్ కొంపముంచింది. చివర్లో రోడ్రిగ్స్ పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్లో విజయం కోసం 3 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి రెండు బంతులకు పరుగులు రావడంతో స్కోర్లు సమయమయ్యాయి. అయితే మేఘనా సింగ్ మూడో బంతికి ఔటవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ సమమైంది. తొలి వన్డే బంగ్లాదేశ్ గెలవగా… రెండో మ్యాచ్ లో భారత్ గెలిచింది. అయితే మ్యాచ్ అంపైరింగ్ పై భారత సారథి హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి అంపైరింగ్ చూడలేదంటూ వ్యాఖ్యానించింది.
Also Read: Cyber Security : సైబర్ దాడుల నుండి కాపాడటానికి ‘హ్యాక్ స్టాప్’ యాప్ వచ్చేస్తుంది.. త్వరలో విడుదల..