Taskin Ahmed : సిక్సర్ బాదిన బంగ్లాదేశ్ ప్లేయర్.. అవుట్ ఇచ్చిన అంపైర్.. ఒక్కసారిగా షాక్!
- By Vamsi Chowdary Korata Published Date - 03:44 PM, Tue - 28 October 25
బంగ్లాదేశ్ – వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి మూడు బంతులకు 17 పరుగులు కావాల్సిన సమయంలో బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ భారీ సిక్సర్ కొట్టినా, అంపైర్ ట్విస్ట్‌తో హిట్ – వికెట్ అవుట్ అయ్యాడు. ఈ సంఘటనతో బంగ్లా అభిమానులు షాక్ అయ్యారు. వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. వెస్టిండీస్ 165 పరుగులు చేయగా, బంగ్లా 149 పరుగులకే ఆలౌట్ అయింది.
బంగ్లాదేశ్ – వెస్టిండీస్ మ్యాచ్‌లో చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. వన్డే సిరీస్‌లో ఓ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లి థ్రిల్లింగ్‌గా ముగియగా.. టీ20 సిరీస్ కూడా అంతే ఆసక్తిగా సాగుతోంది. చిట్టగాంగ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో వెస్టిండీస్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు.. అయితే, అంపైర్ ట్విస్ట్ ఇస్తూ అవుట్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు
తొలుత వెస్టిండీస్ బ్యాటింగ్ చేయగా.. బంగ్లా సెకండ్ ఇన్నింగ్స్ ఆడింది. అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది అనుకున్న సమయంలో టస్కిన్ అహ్మద్ భారీ సిక్సర్ బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చివరి మూడు బంతులకు 17 పరుగులు కావాల్సి ఉండగా, రొమారియో షెఫర్డ్ వేసిన బంతిని టస్కిన్ సిక్సర్‌గా మలిచాడు. దాంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ అంపైర్లు అవుట్‌గా ప్రకటించి బంగ్లాదేశ్‌కు షాక్ ఇచ్చారు.
When you think you've won but life pulls an UNO reverse ◀️#BANvWI pic.twitter.com/neEUjd6bcZ
— FanCode (@FanCode) October 27, 2025
తర్వాత రీ ప్లేలో చూస్తే అసలు విషయం తెలిసింది. టస్కిన్ షాట్ ఆడే సమయంలో తన కాళ్లు స్టంప్‌లకు తాకాయి. దాంతో బెయిల్స్ కిందపడ్డాయి. అందుకే అంపైర్లు హిట్-వికెట్ అవుట్‌గా ప్రకటించారు. ఈ సంఘటనతో బంగ్లాదేశ్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. తద్వారా వెస్టిండీస్ జట్టు 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అథనాజే, బ్రాండన్ కింగ్ రాణించి తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ షై హోప్ 46, రోవ్‌మన్ పావెల్ 44 పరుగులతో ఆఖర్లో విజృంభించడంతో విండీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
వెస్టిండీస్ ఇచ్చిన 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో తంజిమ్ హాసన్ షాకిబ్, నాసుమ్ అహ్మద్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దాంతో 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌట్ అయింది. జేడన్ సీల్స్, జేసన్ హోల్డర్ చెరి మూడు వికెట్లు తీయగా.. అకేలా హోసన్ రెండు, రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.