Novak Djokovic : జకోవిచ్ కు రిలీఫ్..
- By Hashtag U Published Date - 02:40 PM, Mon - 10 January 22

వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు ఊరట లభించింది. జకోవిచ్ వీసాను వెంటనే పునరుద్ధరించాలని మెల్ బోర్న్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు వచ్చి టీకా పత్రాలు సమర్పించకపోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. వీసాను రద్దు చేసి జకోను క్వారంటైన్ కు తరలించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు జకోవిచ్. గత ఐదు రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి సంబంధించి మెల్ బోర్న్ ఫెడరల్ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. జకోవిచ్ లాయర్ల వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు వీసా రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. వెంటనే వీసాను పునరుద్ధరించి, జకోవిచ్ పాస్ట్ పోర్టుతో పాటు ఇతర పత్రాలు అతనికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఇమిగ్రేషన్ అధికారులు నిర్భంధించడాన్ని కూడా తప్పుపట్టిన న్యాయస్థానం జకోవిచ్ వాదనతో ఏకీభవించింది.
అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. కాగా న్యాయస్థానం తీర్పుతో జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు దాదాపుగా మార్గం సుగమమైనట్టే. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. కోవిడ్ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకుండా సొంతంగా ఆటగాళ్ళకు అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టింది. జకోవిచ్ ఇప్పటి వరకూ కోవిడ్ టీకా తీసుకోలేదు. ఆస్ట్రేలియాకు వచ్చే వారు ఎవరైనా టీకా తీసుకున్న పత్రాలు చూపించకుంటే తమ దేశంలోకి అనుమతించడం లేదు. ఒకవేళ వైద్యులు ప్రత్యేక అనుమతితో కొందరికి వెసులుబాటు కల్పిస్తోంది. అయితే జకోవిచ్ మాత్రం టీకా తీసుకోకపోగా… వైద్యుల అనుమతికి సంబంధించిన పత్రాలు కూడా చూపలేదన్నది ఆస్ట్రేలియా అధికారుల ఆరోపణ. నిబంధనలు ఎవరికైనా ఒకటేనని ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టం చేశారు. దీనిపైనే మొదలైన వివాదం చివరికి జకో వీసా రద్దు వరకూ వెళ్ళింది. తాజాగా కోర్టు తీర్పుతో జకోవిచ్ ఏడాది తొలి గ్రాండ్ శ్లామ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని భావిస్తున్నారు.