Australia vs West Indies: తొలి టెస్టులో విండీస్ పై ఆసీస్ ఘనవిజయం
సొంతగడ్డపై మరోసారి తమ ఆధిపత్యాన్ని ఆస్ట్రేలియా నిలుపుకుంది.
- Author : Naresh Kumar
Date : 04-12-2022 - 3:10 IST
Published By : Hashtagu Telugu Desk
సొంతగడ్డపై మరోసారి తమ ఆధిపత్యాన్ని ఆస్ట్రేలియా నిలుపుకుంది. విండీస్ తో జరిగిన తొలి టెస్టులో 164 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చివరి రోజు డ్రా కోసం విండీస్ అద్భుతం చేస్తుందేమో అనుకున్నప్పటకీ.. బ్రాత్ వెయిట్ ఔట్ కాగానే విండీస్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. 497 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 333 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నప్పటికి మిగతావాళ్లు విఫలమయ్యారు.
చివర్లో రోస్టన్ చేజ్ 55 , అల్జారీ జోసెఫ్ 43 పరుగులతో పోరాడినా ఆస్ట్రేలియా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ ఆరు వికెట్లతో విండీస్ ను దెబ్బతీసాడు. లియోన్ టెస్టు కెరీర్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 21వ సారి కాగా.. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు పరుగుల. హెడ్ 2, హాజిల్‌వుడ్, స్టార్క్‌లు చెరొక వికెట్ తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 598 పరుగులకు ఆలౌటైంది. స్మిత్, లబుషేన్‌లు డబుల్ సెంచరీలతో చెలరేగారు. తర్వాత వెస్టిండీస్ 283 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 182 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన లబుషేన్ మరోసారి సెంచరీతో చేశాడు. నాలుగోరోజు విండీస్ పోరాడడంతో చివరి రోజు డ్రాగా ముగిస్తారని కరేబియన్ అభిమానులు ఆశించారు. అయితే ఆసీస్ స్పిన్నర్ లియోన్ విండీస్ కు ఆ అవకాశం ఇవ్వలేదు. కీలక సమయాల్లో విండీస్ వికెట్లు తీస్తూ ఆసీస్ ను గెలిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన లబుషేన్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండో టెస్టు డిసెంబర్ 8 నుంచి 12వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది.