India-Pakistan: ఆసియా కప్ 2025.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు?!
తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
- By Gopichand Published Date - 05:19 PM, Sun - 27 July 25

India-Pakistan: ఆసియా కప్ 2025 షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14న ఈ రెండు జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. అయితే ఇటీవలి పరిణామాలు ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఆడకూడదనే డిమాండ్ దేశంలో బలంగా వినిపిస్తోంది.
రద్దు దిశగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్?
తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో ఇండియా ఛాంపియన్స్- పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అభిమానుల ఒత్తిడి కారణంగా రద్దు చేయబడింది. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా భారత అభిమానులు బీసీసీఐని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఎలాంటి మ్యాచ్ జరగకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒత్తిడి కారణంగా బీసీసీఐ ఈ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Top-5 Languages: భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే టాప్-5 భాషలు ఇవే.. తెలుగు స్థానం ఎంతంటే?!
బీసీసీఐ, ఆటగాళ్లపై పెరుగుతున్న ఒత్తిడి
ఆసియా కప్ ప్రారంభం కావడానికి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. అయితే, మ్యాచ్ తేదీ దగ్గర పడే కొద్దీ అభిమానుల వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో, ఇతర వేదికలపై బీసీసీఐ, ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. మ్యాచ్ నుండి పేరు ఉపసంహరించుకునే నిర్ణయం పూర్తిగా బీసీసీఐ, ఆటగాళ్లకు మాత్రమే సంబంధించినది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఈ కీలక నిర్ణయంపైనే ఉంది. ఈ విషయంలో భారత ప్రభుత్వ వైఖరి కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చు.
చివరగా భారత్-పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 2025 ప్రారంభంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జరిగింది. ఇప్పుడు ఆసియా కప్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్ రద్దవుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.