PSL Ball Tampering: పాకిస్థాన్ క్రికెట్లో మరో వివాదం.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ ప్లేయర్లు..
- Author : Vamsi Chowdary Korata
Date : 30-03-2026 - 10:52 IST
Published By : Hashtagu Telugu Desk
PSL పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాల్ టాంపరింగ్ వివాదం పెద్ద దుమారం రేపుతోంది. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లాహోర్ ఆటగాడు ఫఖర్ జమాన్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన విచారణలో ఫఖర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. మరో 48 గంటల్లో తదుపరి విచారణ జరగనుందని, ఆ తర్వాత తుది తీర్పు వెలువడుతుందని పేర్కొంది. లెవెల్ 3 నేరంగా ఇది రుజువైతే, ఫఖర్‌పై కనీసం ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.
— mediaaaa (@pctarchive) March 29, 2026
ఈ మ్యాచ్ చివరి ఓవర్లో కరాచీ కింగ్స్ విజయానికి 14 పరుగులు అవసరమైన దశలో ఈ వివాదం మొదలైంది. బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతుండగా, కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్ అతనితో చర్చించారు. ఈ సమయంలో ముగ్గురూ బంతిని చేతులతో పట్టుకున్నారు. ఇది సాధారణంగా క్రికెట్లో జరిగేదే అయినా, బంతి ఆకృతి మారినట్లు అంపైర్ ఫైసల్ అఫ్రిది గుర్తించారు. మరో అంపైర్ షర్ఫుద్దౌలతో చర్చించి, బంతిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని నిర్ధారించారు. వెంటనే కరాచీ కింగ్స్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయించి, బంతిని మార్చారు.
దీంతో కరాచీ విజయ సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. చివరి ఓవర్లో తొలి బంతికి వికెట్ పడినా, తర్వాతి బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో అబ్బాస్ అఫ్రిది 19.3 ఓవర్లలోనే కరాచీకి విజయాన్ని అందించాడు.
ఈ ఘటనపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ముగ్గురు ఆటగాళ్లు బంతిని తాకినప్పుడు, కేవలం ఫఖర్ జమాన్‌ను మాత్రమే ఎలా బాధ్యుడిని చేస్తారని లాహోర్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలు, టెక్నాలజీ వినియోగంపై కూడా వాదనలు వినిపిస్తున్నాయి. తదుపరి విచారణలో హై-డెఫినిషన్ బ్రాడ్కాస్ట్ ఫుటేజీని, మ్యాచ్ రిఫరీ నివేదికను పీసీబీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. గతంలో ఆస్ట్రేలియా క్రికెట్లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లాంటి ఆటగాళ్లపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు రుజువు కావడంతో సుదీర్ఘ నిషేధం విధించారు. ఇప్పుడు ఫఖర్, షాహీన్, హరీస్ విషయంలో పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.