Ram Navami Violence: ఎన్‌ఐఏ చేతికి పశ్చిమ బెంగాల్ హింసాకాండ కేసు
పశ్చిమ బెంగాల్‌లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై ఎన్‌ఐఏ విచారణ చేపట్టనుంది. హౌరా, దల్‌ఖోలా జిల్లాలు మరియు ఇతర ప్రాంతాల్లో రామనవమి సందర్భంగా చెలరేగిన హింసాకాండ
- Author : Praveen Aluthuru
Date : 27-04-2023 - 12:29 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Navami Violence: పశ్చిమ బెంగాల్‌లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై ఎన్‌ఐఏ విచారణ చేపట్టనుంది. హౌరా, దల్‌ఖోలా జిల్లాలు మరియు ఇతర ప్రాంతాల్లో రామనవమి సందర్భంగా చెలరేగిన హింసాకాండపై విచారణను కలకత్తా హైకోర్టు ఎన్‌ఐఏకు బదిలీ చేసింది.
బెంగాల్‌లోని హౌరా, హుగ్లీ మరియు దల్‌ఖోలాలో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు గురువారం NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) విచారణకు ఆదేశించింది. ఈ హింసాకాండకు సంబంధించిన అన్ని పత్రాలను ఎన్‌ఐఏకు అందజేయాలని బెంగాల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల రామ నవమి ఊరేగింపులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అల్లర్లు, హింస చోటు చేసుకుంది. అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు కూడా జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలను రెండు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రాష్ట్ర పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత పత్రాలను ఎన్‌ఐఏకు పంపాలని కేంద్రాన్ని ఆదేశించింది.
హింసాకాండపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించడం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని గతంలో మమత పలుమార్లు ఆరోపించారు. స్కూల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌తో సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంభకోణాలపై కేంద్ర ఏజెన్సీలు ఇప్పటికే విచారణ జరుపుతున్నాయి. మరోవైపు హింసాకాండపై దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించడం మమతకు షాకిచ్చినట్టేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
Read More: Amazon Prime: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాక్.. ప్లాన్ ల ధరలు పెంచేసిన అమెజాన్..!