Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్లో పలు రికార్డులు బద్దలు
- Author : Prasad
Date : 30-05-2026 - 7:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 96 పరుగులతో చెలరేగిన ఈ 15 ఏళ్ల యువ సంచలనం పలు ఐపీఎల్ రికార్డులను బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు. మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు బాదిన అతడు 204.26 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే 18వ ఓవర్లో రబడా బౌలింగ్‌లో అవుటై కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే శతకం మిస్సైనా రికార్డుల విషయంలో మాత్రం సూర్యవంశీ కొత్త చరిత్ర రాశాడు. సాయి సుదర్శన్ పేరిట ఉన్న అత్యంత వేగంగా 1000 ఐపీఎల్ పరుగులు చేసిన భారత బ్యాటర్ రికార్డును అధిగమించాడు. సాయి సుదర్శన్ 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, సూర్యవంశీ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
అలాగే వెస్టిండీస్ మాజీ బ్యాటర్ సైమన్స్ రికార్డును సమం చేస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో మార్ష్ 21 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు ఒకే ఐపీఎల్ సీజన్లో పవర్‌ప్లేలో 500కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఈ సీజన్లో అతని ఖాతాలో పవర్‌ప్లేలో 502 పరుగులు ఉన్నాయి. గతంలో ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ 2016 సీజన్లో పవర్‌ప్లేలో 467 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ 776 పరుగులు సాధించాడు. 237.30 స్ట్రైక్‌రేట్, 48.50 సగటుతో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అతడు 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అయాతే రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ గుజరాత్ ఓటమి చెందిన ఇంటిబాట పట్టింది. గుజరాత్ టైటాన్స్ రేపు బెంగుళూర్పై ఫైనల్లో తలపడనుంది.