TTD : అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి.. జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమం
- By Prasad Published Date - 08:56 PM, Mon - 6 June 22
అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అమరావతి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి హాజరవుతారని తెలిపారు. ఇటీవల పలు రాష్ట్ర రాజధాని నగరాల్లో నిర్మించిన ఆలయాల కంటే ఈ ఆలయం చాలా పెద్దదని..ఆలయ నిర్మాణానికి దాదాపు రూ. 40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక్కడ 25 ఎకరాల స్థలం ఉందని, పచ్చదనాన్ని పెంచి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.