Tragic Incident : ఆ ఇంట విషాదాన్ని నింపిన పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్..
Tragic Incident : పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంతటా సంబరాలు జరుగుతాయి. నిరంతరంగా కష్టపడి చదువుతున్న యువకులు, దేహదారుఢ్య పరీక్షలను అధిగమించేందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.
- By Kavya Krishna Published Date - 06:32 PM, Thu - 2 January 25
Tragic Incident : పోలీసు ఉద్యోగం కోరుకునే యువతలో అత్యధిక క్రేజ్ ఉంటుంది. కొందరు వారి జీవితంలో ఒక్కసారైనా ఖాకీ చొక్కా వేసుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని, నేరస్తులను చట్టం ఆధీనంలోకి తీసుకురావాలని కలలు కంటుంటారు. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంతటా సంబరాలు జరుగుతాయి. నిరంతరంగా కష్టపడి చదువుతున్న యువత దేహదారుఢ్య పరీక్షలను అధిగమించేందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. రాత్రిబంవళ్లు కష్టపడినప్పటికీ, విజయం సాధిస్తామా లేక మరొకసారి విఫలమవుతామా అనే ఒత్తిడితో అనేక మంది యువకులు పరీక్షల్లో విఫలమవుతుంటారు. కొన్ని సందర్భాల్లో, అతి కష్టమైన పరీక్షలు, రన్నింగ్ రేసులు ప్రాణాలను కూడా కోల్పోవడానికి దారి తీస్తాయి.
తాజాగా, అటువంటి ఒక విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన, ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల చంద్రశేఖర్‌కు జరిగినది. పోలీస్ ఉద్యోగం పొందాలని అనుకున్న ఆయన, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అప్లై చేసి, మచిలీపట్నంలో జరుగుతున్న పరీక్షలకు హాజరయ్యాడు.
ఈ రోజు 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న చంద్రశేఖర్, కాసేపటికే మూర్చిపోయి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అంబులెన్స్ సిబ్బంది కూడా ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేశారు. అతన్ని తక్షణమే మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ఇచ్చినా, చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. తమ కుమారుడు పోలీస్ ఉద్యోగం పొందుతాడని ఆశించిన చంద్రశేఖర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రశేఖర్ మరణ వార్తవిన్న అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.